ప్రముఖ భారత మహిళా స్ప్రింటర్ హిమాదాస్.. అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 4 బంగారు పతకాలు సాధించింది. బుధవారం చెక్ రిపబ్లిక్లో జరిగిన టబోర్ అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్ల రేసులో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. ఈ రేసును 23.25 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సంపాదించింది. 200 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఇప్పటికే 23.10 సెకన్లతో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది.
- జూలై 2న పోలాండ్లో జరిగిన పొజనాన్ గ్రాండ్ ప్రిక్స్ 200 మీటర్ల పందెంలో 23.65 సెకన్లతో తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది.
- జూలై 7న అదే పోలాండ్లో జరిగిన కుంటో అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్లను 23.97 సెకన్లలో పూర్తి చేసి రెండో బంగారు పతకం సాధించింది.
- జూలై 13న చెక్ రిపబ్లిక్లో జరిగిన క్లాండో మీట్లో 200 మీటర్ల రేసును 23.43 సెకన్లలో పరుగెట్టింది. మూడో గోల్డ్ మెడల్ పొందింది.
వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాలంటే 400 మీటర్లను 51.80 సెకన్లలో, 200 మీటర్లను 23.02 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఈ అసోం రన్నర్ వీటిని సాధిస్తుందేమో చూడాలి.
ఇది చదవండి: 'క్రికెట్ ముందు నా విజయం ఓడిపోయింది' అంటున్న రన్నర్ ద్యుతీ చంద్