Sunil Chhetri Record : ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్ స్థానం ఎక్కడో దిగువన ఉంటుంది. కానీ అతను మాత్రం భారత ఆటగాళ్లెవ్వరూ అందుకోలేనంత ఎత్తున ఉంటాడు. భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు ఎన్నో ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉన్నట్లు ఉన్నా.. అతను మాత్రం తన ఆటను మెరుగుపరుచుకుంటూ ఇంతకు ఇంతై ఎంతో ఎత్తుకు ఎదిగిపోతూనే ఉంటాడు. వయసు అనేది తనకు ఓ సంఖ్య మాత్రమే.. అది అతడిపై ఏమాత్రం ప్రభావం చూపదు. భారత ఫుట్‌బాల్ రాజకీయాలు అతడికి పట్టవు. మైదానంలో దిగితే ఇక గోల్ మీదే అతడి గురి. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా .. ఉత్తమ ప్రదర్శనతో జట్టును గెలిపించడమే ధ్యేయంగా ఆటలో సాగిపోతాడు. ఈ ఉపోద్ఘాతం సునీల్ ఛెత్రి గురించే అని భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఈపాటికే అర్థమై ఉంటుంది.
ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో.. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న లెబనాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచిన ఛెత్రిదే అత్యంత కీలక పాత్ర. ఈ పోరాట యోధుడు.. ఇప్పుడు శాఫ్ కప్‌లోనూ భారత్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద భారత్ 4-0తో ఘన విజయం సాధిస్తే.. అందులో మూడు గోల్స్ సునీల్దే. బుధవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ దూకుడు చూసిన ఎవ్వరైనా.. తన వయసు 38 ఏళ్లంటే అసలు నమ్మరు. పాతికేళ్ల కుర్రాడిని తలపించే రూపం, ఫిట్‌నెస్, చురుకుదనం, ఆటతో అతను అభిమానులను కట్టిపడేశాడు. బెంగళూరు లాంటి నగరంలో భారత జట్టు ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు పాతిక వేల మంది దాకా వచ్చి క్రికెట్ మ్యాచ్ తరహాలో స్టేడియాన్ని కోలాహలంగా మార్చారంటే అదంతా ఛెత్రి మహిమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని ఆటతీరుతో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు భారత కెప్టెన్.
అప్పుడు.. ఇప్పుడు..
2005లో 21 ఏళ్ల వయసులో ఉన్న సునీల్.. పాకిస్థాన్ జట్టు పైనే తన తొలి అంతర్జాతీయ గోల్‌ను సాధించాడు. అప్పుడు, ఇప్పుడు రెండు జట్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆడిన మిగతా ఆటగాళ్లలో ఎవ్వరూ ప్రస్తుత జట్లలో లేరు. కానీ ఇప్పటికీ జట్టులో తిరుగులేని స్టార్‌గా కొనసాగుతుండటం సునీల్ ప్రత్యేకతను చాటుతుంది. పాక్‌పై హ్యాట్రిక్‌తో దూసుకెళ్తున్న సునీల్.. ఆసియాలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్లలో మూడో స్థానానికి చేరడం విశేషం. ప్రస్తుతం 90 గోల్స్‌తో ఉన్న ఛెత్రి.. ఇంకో రెండేళ్లు ఆటలో ఉండి, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. మెస్సీ(103), అలీ డాయ్ (109)ను అధిగమించి ఆసియా నంబర్‌వన్ స్టార్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడం ఖాయం.
ఇక ప్రపంచ స్థాయిలో తనకంటే క్రిస్టియానా రొనాల్డో (123), అలీ డాయ్ (109), లియోనెల్ మెస్సి (103) మాత్రమే ముందున్నారు. రొనాల్డో, మెస్సి లాంటి ఆల్‌టైం గ్రేట్స్ సరసన ఛెత్రి ఉండటం భారతీయులకు గర్వకారణం. ప్రస్తుత పరిస్థితిలో భారత జట్టు ప్రమాణాల దృష్ట్యా ఛెత్రి ప్రపంచ స్థాయి జట్లతో తలపడకపోవచ్చు. కానీ తాను ఎదుర్కొనే ప్రతి జట్టు మీదా ఉత్తమ ప్రదర్శనతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడన్నది మాత్రం వాస్తవం.