ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ద్యుతీ చంద్.. పీటీ ఉష తర్వాత ఒలింపిక్స్‌కు (2016 రియో) అర్హత సాధించిన తొలి స్ప్రింటర్‌గా ఘనత వహించింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు దక్కించుకుంది. గతేడాది నేపిల్స్లో జరిగిన వరల్డ్ వర్సీటీ గేమ్స్‌లో సత్తాచాటింది. ఆ పోటీల్లో 100 మీటర్ల పరుగులో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ అథ్లెట్.. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు అనుభవించింది. స్వలింగ సంపర్కురాలని నిందలు, నిషేధాన్ని ఎదుర్కొంది. అలా ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమె.. 2016లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ద్యుతి.. పలు విశేషాలను ఈటీవీ భారత్‌తో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...
లాక్డౌన్ ఎలా ఉపయోగపడింది?
లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్నా. కరోనా రాకముందు ఆటల కోసం వివిధ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు కుటుంబంతో గడిపేందుకు పెద్దగా సమయం ఉండేది కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రీడలు నిలిచిపోవడం వల్ల ఖాళీ దొరికింది. అందుకే ఈ సమయాన్ని కుటుంబానికి వెచ్చిస్తున్నాను.
కరోనా విరామంతో నష్టం ఉందా?
కరోనా విరామం నాకు విభిన్న అనుభూతులను అందిస్తోంది. కుటుంబంతో ఉన్నానని ఆనందంగా ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు నా సన్నాహాల కోసం పెట్టుకున్న షెడ్యూల్ దెబ్బతిందని బాధపడుతున్నా. ఆ ఈవెంట్ కోసం బాగా డబ్బులు ఖర్చుచేశా. అదంతా వృథా అయిందని బాధగా ఉంది.
ఒలింపిక్స్ సన్నాహాలకు మరింత సమయం వచ్చిందని భావిస్తున్నారా?
గతేడాది అక్టోబర్‌లో టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ ప్రారంభించా. ఈ ఏడాది మే నెల నాటికి అర్హత పోటీల్లో పాల్గొనాల్సింది. కానీ కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్(2020) ఏడాది వాయిదా పడటం వల్ల మళ్లీ తర్ఫీదు ప్రారంభించాలి.
కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి?
ఆటల్లోకి వచ్చిన తొలిరోజుల్లో చాలా కష్టాలు పడ్డా. అలాంటి పరిస్థితుల్లో నా కుటుంబం మద్దతుగా నిలిచింది. తొలి రోజుల్లో షూ లేకుండా మా గ్రామంలో పరుగెత్తేదాన్ని. సరైన మైదానం లేదు. కోచ్ లేరు. అయినా అలానే ప్రాక్టీస్ చేశా. అప్పుడు ప్రజల నుంచి హేళన ఎదుర్కొన్నా. అయితే వెనకడుగు వేయకుండా అథ్లెట్ అవ్వాలన్న నా కల నెరవేర్చుకున్నా.
ప్రభుత్వ ఉద్యోగం కోసం రన్నింగ్ ప్రారంభించారని తెలుసు. మరి ఎప్పుడు ఫ్రొఫెషనల్ అవ్వాలని అనుకున్నారు?
నా సోదరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. అదే అంశం నన్ను స్ప్రింటర్ అయ్యేందుకు ప్రభావితం చేసింది. మొదట ఉద్యోగం కోసమే మొదలుపెట్టా. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాను. 2013లో తొలి అంతర్జాతీయ పతకం అందుకున్నా. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఆసియా గేమ్స్‌లో రెండు రజతాలు సాధించా. యూనివర్సిటీ గేమ్స్‌లో పసిడి గెలిచిన తొలి భారత అథ్లెట్‌ను నేనే.
2015లో ఐఏఏఎఫ్ మీపై నిషేధం విధించినప్పుడు ఎలా అనిపించింది?
2014లో ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యా. అయితే శిక్షణ తరగతులు పూర్తయ్యే సమయానికి భారత బృందం జాబితా నుంచి నా పేరు తొలగించారు. టోర్నీలో పాల్గొనేందుకు అర్హత లేదన్నారు. ఎవరూ కారణం చెప్పలేదు. నా రక్త నమూనాల్లో ఏదో తేడా ఉందని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని మాత్రమే అందరూ చెప్పారు. అయితే ఆ తర్వాత ఓ వైద్య నిపుణురాలు ఐఏఏఎఫ్ నియమ, నిబంధనలు తెలిపారు. హైపరాండ్రోర్గానిజం ఉన్నట్లు చెప్పిన ఆమె పలు విషయాలను వివరించారు. ఐఏఏఎఫ్ టెస్టులో విఫలమైతే జీవిత కాలం నిషేధం పడే అవకాశముందని ఆమె హెచ్చరించారు.
హార్మోన్ స్థాయి పెరుగుదలకు నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని.. అది పుట్టుకతోనే వచ్చినట్లు గ్రహించా. ఆ తర్వాత నా నిషేధంపై కోర్టును ఆశ్రయించా. దాదాపు రెండేళ్ల తర్వాత విజయం సాధించా. బ్యాన్ తొలగిపోయాక శిక్షణ శిబిరంలో పాల్గొని రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యా. 36 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న తొలి భారతీయ స్ప్రింటర్‌ను నేనే అనుకుంటా.
స్వలింగ సంపర్కులు అని తెలిసిన తర్వాత సన్నిహితుల స్పందనేంటి?
స్వలింగ సంపర్కాన్ని చాలా మంది చాలా రకాలుగా పిలుస్తారు. కానీ నా వరకు మాత్రం అది ప్రేమ. నేను నా స్నేహితురాలిని ప్రేమించా. నిజానికి నా బంధం గురించి తొలుత కుటుంబానికే వివరించా. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పా. వివాహం జరగకపోయినా తనతో జీవితాంతం ఉండాలని కోరుకున్నా. ఆ సమయంలో లెస్బియన్, గే అంటే అర్థాలే తెలియదు. అయితే విషయం తెలిసిన అమ్మ మాత్రం పరిణతి గల అమ్మాయిగా ఆలోచించు అని సర్దిచెప్పింది.
ఆసియా క్రీడల్లో రజతం గెలిచాక.. ప్రభుత్వం రూ. 3 కోట్లు ప్రకటించింది. అప్పట్నుంచి నా సోదరి మనస్తత్వం మారిపోయింది. డబ్బు కోసమే తను నాతో మాట్లాడేది. అడిగినట్లు డబ్బులు ఇవ్వకపోతే నా ప్రేమ విషయం మీడియా ద్వారా అందరికీ చెప్తానని బెదిరించేది. తొలుత కొన్ని రోజులు ఆమె ఇబ్బందులు సహించి డబ్బులు ఇచ్చా.. ఆ తర్వాత రోజూ ఆ గోల తట్టుకోలేక నేనే ప్రజల ముందుకు వచ్చి చెప్పేశా. నేను స్వలింగ సంపర్కురాలినని తెలిశాక కొందరు విమర్శించారు. కానీ అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీ ఎలెన్ డిజెనెరస్ నాకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సహా పలువురు నాకు అండగా మాట్లాడారు. అలా ప్రజలు కూడా నావైపు మాట్లాడారు. అయితే ఆ అమ్మాయితో ప్రేమ బంధం ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు తనతో కలిసే ఉండాలని నిశ్చయించుకున్నా. నా భాగస్వామిని నాతో ఎప్పటికీ ఉండిపో అని మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇష్టపూర్వకంగానే ఇద్దరం బంధం కొనసాగిస్తున్నాం.