బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో కలకలం మొదలైంది. లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్, డిఫెండర్ డానీ అల్వెస్ అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళపై లైగింక దాడికి పాల్పడినందుకు డానీని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో డానీ అల్వెస్ బెయిల్ అప్పీల్ చేసుకోగా.. స్పెయిన్ కోర్టు తిరస్కరించింది. డానీని కస్టడీలోనే ఉంచి విచారించాలని పోలీసులను ఆదేశించింది.
నేను చేయలేదు.. తనపై వచ్చిన ఆరోపణలను డానీ ఖండించాడు. "ఆ సమయంలో నేను ఆ క్లబ్‌లో కొంతమందితో కలిసి ఉన్నాను.. కానీ ఏ తప్పు చేయలేదు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతే కానీ ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలను? అని డానీ విచారణలో చెప్పినట్లు స్థానిక వార్తా పత్రికలు కథనాలు ప్రచురితం చేశాయి.
అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్‌లో తనతో డానీ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో డానీపై కేసు నమోదు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా తెలిపింది. కాగా, 2022లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. ఆ మెగాటోర్నీ క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగానూ గుర్తింపు పొందాడు.