Australina open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. లోకల్ స్టార్ ఆష్లే బార్టీ, అమెరికా అమ్మాయి డానియెలీ రోజ్ కొలిన్స్ మధ్య శనివారం మధ్యాహ్నం ఫైనల్ జరగనుంది. ఇద్దరూ తొలి టైటిల్ కోసం తహతహలాడుతున్నవారే కావడం విశేషం.
బార్టీ ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్‌లు (2021 వింబుల్డన్, 2019 ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గినా.. తన దేశంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మాత్రం గెలుచుకోలేకపోయింది. సొంతగడ్డపై విజేతగా నిలిచి కల నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని బార్టీ భావిస్తోంది. ఇక సంచలన ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన కొలిన్స్.. అదే ఊపులో టైటిల్ పట్టేయాలని చూస్తోంది. మరి ట్రోఫీ ఎవరిని వరిస్తుందో చూడాలి.
అంపైర్‌పై చిందులు
ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) మెద్వెదెవ్‌కు కోపమొచ్చింది. సిట్సిపాస్‌తో సెమీఫైనల్ సందర్భంగా అతను చైర్ అంపైర్ కాంపిస్టోల్‌పై చిందులు తొక్కాడు. స్టాండ్స్‌లో ఉన్న సిట్సిపాస్ తండ్రి కొడుక్కి నిబంధనలకు విరుద్ధంగా సూచనలు ఇస్తుండటం, ఎంతకీ అంపైర్ స్పందించకపోవడం వల్ల అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
విరామ సమయంలో కుర్చీలో కూర్చుని ఉన్న అంపైర్ వైపు కోపంగా చూస్తూ.. "నువ్వేమైనా దద్దమ్మవా? అతడికి తండ్రి శిక్షణ ఇస్తుంటే నీకు కనిపించడం లేదా? నా ప్రశ్నకు జవాబు చెప్పు" అంటూ అరిచాడు. అతడికేదో సర్ది చెప్పి.. అంపైర్ తల పక్కకు తిప్పగా.. "నేను నీతో మాట్లాడుతున్నాను. నా ప్రశ్నకు జవాబు చెప్పు" అంటూ మెద్వెదెవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మ్యాచ్ పూర్తయ్యాక కూడా అంపైర్‌ను కోపంగా ఏదో అనేసి వెళ్లాడతను.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!