మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడింది. టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) ప్రకటించింది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు.
"ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వాయిదా ప్రకటించిక ముందు ఐఓసీ నిర్వహకులు, సభ్యదేశాలను సంప్రదించింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రణాళికల గురించి అథ్లెట్లు, సమాఖ్యలు, స్పాన్సర్లతో ఏఓసీ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాధన చేయాలనే ఆందోళన నుంచి మా అథ్లెట్లకు ఉపశమనం కలుగుతుంది".
-రాజీవ్ మెహతా, ఐఓఏ సెక్రటరీ జనరల్
ముందుగా జులై 24 నుంచి ఈ క్రీడల్ని నిర్వహించాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో కెనడా గేమ్స్ నుంచి తప్పుకోగా ఆస్ట్రేలియా కూడా అదే బాటలో వెళ్లింది. మిగతా దేశాలు అలాంటి ఆలోచనతోనే ఉన్నట్లు గ్రహించిన ఐఓసీ.. క్రీడాకారుల రక్షణ దృష్ట్యా వాయిదా వేసింది. ఏడాది పాటు వాయిదాపడ్డా ఈ మెగాటోర్నీని టోక్యో ఒలింపిక్స్-2020 గానే పిలుస్తామని నిర్వాహకులు తెలిపారు.