ప్రపంచాన్ని వణికిస్తోన్న రాకాసి వైరస్ కొవిడ్-19 (కరోనా).. ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌పై ఉంటుందా? ప్రస్తుతం క్రీడాభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఈ విషయంపై ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయడం సరైనది కాదని అభిప్రాయపడింది.
ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొన్నారు యూఎన్ ఏజెన్సీ ఎమెర్జెన్సీ ప్రోగ్రామ్ అధికారి మైకేల్ ర్యాన్. తాజాగా డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
"ఒలింపిక్స్ నిర్వహణపై మేం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేం. అయితే కొవిడ్ ముప్పును అంచనా వేయడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సహకరిస్తాం. రాబోయే రోజుల్లో వారితో కలిసి పనిచేస్తాం" అని అన్నారు. డిసెంబర్‌లో కొవిడ్ 19 వైరస్‌ను గుర్చించినప్పటి నుంచి క్రమం తప్పకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో సంప్రదింపులు జరుపుతోంది డబ్ల్యూహెచ్‌వో.
కొవిడ్-19 వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య... బుధవారం నాటికి 2వేలు దాటేసింది. సుమారు 74,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో జరగాల్సిన మహిళా ఒలింపిక్ ఫుట్‌బాల్ అర్హత పోటీలు, ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్, ఎఫ్1 గ్రాండ్‌ప్రిక్స్ వంటి ఈవెంట్స్‌ను వాయిదా వేశారు. మరికొన్నింటికి వేదికను మార్చారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్లతో సహా మరికొన్ని పోటీలకు చైనా క్రీడాకారులను ఇతర దేశాలు అనుమతించట్లేదు.
భారత్‌లో నో ఎంట్రీ...
కొవిడ్-19 ఎఫెక్ట్‌తో మంగళవారం నుంచి దిల్లీలో ప్రారంభమైన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో.. చైనా రెజ్లర్లు పాల్గొనడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా 40 మంది చైనా బృందానికి భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేయలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.
" చైనా బృందానికి ప్రభుత్వం వీసాలు మంజూరు చేయలేదు. దీనివల్ల ఛాంపియన్‌షిప్‌లో వారు పాల్గొనడం లేదు. ప్రపంచాన్ని కొవిడ్-19 వణికిస్తోంది. అంతేకాక అథ్లెట్ల ఆరోగ్యం మాకు ఎంతో ముఖ్యం. అందువల్లే ప్రభుత్వం వారికి అనుమతి ఇవ్వలేదు. మేం తీసుకున్న నిర్ణయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వ్యతిరేకించలేదు. ఇతర దేశాల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు కూడా ఆ దేశాలు చైనా అథ్లెట్లకు అనుమతి ఇవ్వలేదు" అని వినోద్ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం జపాన్‌లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్, ఆగస్టు 25న పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు దాదాపు 11,000 మంది అథ్లెట్లు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇటీవల జపాన్‌లోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో దాదాపు 500 మందికి కొవిడ్-19 వైరస్ సోకినట్లు గుర్తించారు.