మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వల్ల ఈ విశ్వక్రీడలు ఆపేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం ఒలింపిక్స్‌ను ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను నిరసిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. టోక్యో వీధుల్లో.. పోటీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్కు ఒలింపిక్స్ రద్దు విషయమై లేఖలు ఇవ్వడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అందుకోసం ఆయన ఆఫీస్ వద్దకు వెళ్లారు. కానీ పోలీసులు వారిని అడ్డుకుని ప్రదర్శనను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభంకాబోతున్నాయి. మహమ్మారి వల్ల ప్రేక్షకులు లేకుండానే ఈసారి విశ్వక్రీడలు జరగనున్నాయి. కొన్ని క్రీడలకు మాత్రం పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు.
టోక్యో కరోనా కేసులు
అయితే ఇప్పటికీ కరోనా భయం వీడలేదు. శుక్రవారం నాడు టోక్యోలో 1,272 కరోనా కేసులు నమోదయ్యాయి. వారం క్రితం కేసుల సంఖ్య 822గా ఉంది. దీనిని బట్టి చూస్తే ఒలింపిక్స్ గ్రామంలో మహమ్మారి తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.