కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్ చేసిన అచింత.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.
క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్ చేసి మొత్తం మీద 313 కేజీలతో (క్రీడల రికార్డు) పసిడి సొంతం చేసుకున్నాడు. హిదాయత్ (303 కేజీలు, మలేసియా) రజతం గెలవగా.. షాద్ (298 కేజీలు, కెనడా) కాంస్యం సాధించాడు. 2021 జూనియర్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 2019, 2021ల్లో ఛాంపియన్‌గా నిలిచాడు.
ఇవీ చూడండి