టీమ్‌ఇండియా((TeamIndia) కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) గొప్ప క్రికెటర్లని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. వారిద్దరూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను(WTC Final) ముందుకు నడిపించాలని సూచించాడు. వారిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండదని, జట్ల కోసమే కష్టపడతారని వెల్లడించాడు.
"విరాట్, విలియమ్సన్ మధ్య పోటీ ఉండదు. పైగా వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారు. నిజానికి వారిద్దరూ ఆయా దేశాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆదర్శప్రాయులు. వారు జట్లను నడిపిస్తున్న తీరు అమోఘం. సొంత ప్రతిభ, సామర్థ్యంపై ఆశావహ దృక్పథంతో ఉంటారు. సీనియర్లు వీడ్కోలు పలికాక జట్లను సమర్థంగా నడిపిస్తున్నారు. క్రికెట్ ఆడుతున్నందుకు వారిద్దరూ గర్వపడుతుంటారు. దేశానికి ఆడుతున్నామా, ఐపీఎల్ లేదా క్లబ్ క్రికెట్ కోసమా అనేది పట్టించుకోరు. ఏ మ్యాచుకైనా వారు ఒకేలా సిద్ధమవుతారు"
-వీవీఎస్ లక్ష్మణ్.
"థియరీ ప్రకారం చెప్పాలంటే టెస్టు ఫైనల్ పరిస్థితులు కివీస్‌కే అనుకూలం. ఎందుకంటే విదేశాల్లో ఎప్పుడు టెస్టు సిరీసులు ఆడాలన్నా ముందుగానే ఒకటో రెండో సన్నాహక మ్యాచులు ఆడటం ఆనవాయితీ. అప్పుడు పరిస్థితులకు అలవాటు పడతారు. అందుకే కొన్నేళ్లుగా జట్లన్నీ ఇలాగే చేస్తున్నాయి. ముఖ్యంగా పరిస్థితులకు బ్యాట్స్‌మెన్ అలవాటు పడటం అవసరం. న్యూజిలాండ్ ముందుగానే ఇంగ్లాండ్ వెళ్లింది. కాబట్టి ఆ జట్టుకు ప్రయోజనం ఉంటుంది. టీమ్‌ఇండియా వెనుకంజలో ఉందనుకోవద్దు. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వారికి తెలుసు. ఆస్ట్రేలియాలో ఆ జట్టు పోరాటం, సానుకూల దృక్పథాన్ని మనం చూశాం. ఫైనల్‌కు ముందు కోహ్లీసేన కఠోరంగా సాధన చేస్తుంది"
-వీవీఎస్ లక్ష్మణ్.
భారత జట్టు.. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో క్వారంటైన్లో ఉంది. అది పూర్తవ్వగానే సాధన మొదలుపెడుతుంది. జూన్ 18-22వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) తలపడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4- సెప్టెంబర్ 14 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది.