వావ్! విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. రోహిత్ శర్మ చితక్కొట్టాడు. మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. డివిలియర్స్ సిక్సుల మోత మోగించాడు. కామెంటేటర్స్‌తో సహా క్రికెట్ ప్రేమికులు, అభిమానుల నుంచి మనకు తరచూ వినిపించే మాటల్లో ఇవి కొన్ని. అవును ఇటీవల జరిగిన ఐపీఎల్లో బ్యాటింగ్ మరో స్థాయిలో ఉంది. కానీ బౌలర్ల పరిస్థితేంటి?
పైన బ్యాట్స్‌మెన్ గురించి చెప్పినట్లు మీరు బౌలర్లు గురించి గొప్పగా ఏమైనా విన్నారా? దాదాపుగా విని ఉండరు! ఎందుకంటే అది మీ తప్పు కాదు. క్రికెట్ అనేది చాలా ఏళ్ల క్రితమే బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిపోయింది. బౌలర్లు ఎంతలా కృషి చేసినప్పటికీ వాళ్లకు తగినంత గుర్తింపు రావడం లేదు. ఎవరూ ఎన్ని చెప్పినా ఇది కాదనలేని నిజం.
ఈ సీజన్లో బ్యాటింగ్‌కు కష్టంగా మారిన చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌లపై పలువురు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. అదే ఫ్లాట్ పిచ్‌లపై బౌలర్లు మెప్పించే ప్రదర్శన చేస్తే ఎవరైనా గుర్తిస్తారా అంటే లేదు. స్పిన్ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ ఆడితే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇస్తారు కానీ ఫ్లాట్ పిచ్‌లపై బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తే, వాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చేందుకు ఎందుకు సంకోచిస్తారు?
అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ల్లో పరిస్థితేంటి?
వాంఖడే(ముంబయి), చిదంబరం(బెంగళూరు) స్టేడియాల్లో ఈ సీజన్‌లోని పలు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అందులో బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చారు. వారు దానికి అర్హులే కావొచ్చు. కానీ అదే పిచ్‌లపై పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లకూ ఆ అవార్డు ఇవ్వకూడదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. 222 పరుగల లక్ష్య ఛేదనలో 119 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసినప్పటికీ, తమ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు చెందిన కెప్టెన్ శాంసన్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. కానీ 11 రన్‌రేట్‌తో మొత్తంగా 438 పరుగులు నమోదైన ఈ పోరులో పంజాబ్ బౌలర్ అర్షదీప్ (3/35) మెరుగైన గణాంకాలతో బౌలింగ్ చేశాడు. కానీ అతడిని ఎవరూ గుర్తించలేదు.
చెన్నై - దిల్లీ మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఆకట్టుకున్నాడు. 54 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే లాంటి ఫ్లాట్ పిచ్‌పై పరుగులు చేయడం ఏమైనా కష్టమా?
ఇదే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బౌలర్ ఆవేశ్ ఖాన్(దిల్లీ) గురించి చాలా తక్కవమంది మాత్రమే మాట్లాడలేదు. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసి, నాలుగు ఓవర్లలో 23 పరుగులే ఇచ్చాడు. డుప్లెసిస్, ధోనీ లాంటి కీలక వికెట్లు తీశాడు. ఇక్కడ అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకునే అర్హత లేదా?.. సమాధానం మీకే వదిలేస్తున్నాను.
బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌లపై పరిస్థితేంటి?
ఈ సీజన్లో చెన్నైలో జరిగిన 10 మ్యాచ్‌ల్లో ఐదింటిలో బ్యాట్స్‌మెన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లుగా నిలిచారు. ఇదే పిచ్‌పై హైదరాబాద్-ముంబయి మధ్య జరిగిన పోరులో పొలార్డ్, 22 బంతుల్లో 35 పరుగులు చేసి, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. అదే మ్యాచ్‌లో 3/19 గణాంకాలతో ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేసిన రాహుల్ చాహర్.. ఆ అవార్డుకు అర్హుడు కాదా?
కష్టతరమైన పిచ్‌లపై బాగా ఆడిన బ్యాట్స్‌మెన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చినప్పుడు ఉన్న లాజిక్.. ఫ్లాట్ పిచ్‌లపై బాగా బౌలింగ్ చేసిన బౌలర్లు ఎందుకు వర్తించదో? క్రికెట్ అనేది ఇప్పటికే బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోయింది. ఇలానే జరిగితే భవిష్యత్తులో బౌలర్లకు బదులు బౌలింగ్ మెషీన్స్ పెట్టుకునే గత్యంతరం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!