క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. కేవలం 8 పరుగులకే ఓ జట్టు కుప్పకూలింది. ఈ రికార్డు నేపాల్ మహిళల అండర్ 19 జట్టు ఖాతాలో నమోదైంది. ఈ రికార్డు ఏదో లోకల్ టోర్నీలో కాదు.. వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన ఐసీసీ అండర్ 19 మహిళల ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేపాల్ టీమ్ 8.1 ఓవర్లలో 8 రన్స్‌కే చాప చుట్టేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్ టీమ్‌లో ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. 10 బంతుల్లో 3 పరుగులు చేసిన స్నేహా మహారా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆరుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం.
యూఏఈ రైట్ ఆర్మ్ బౌలర్ మహికా గౌర్ స్పిన్ మాయాజాలానికి నేపాల్ జట్టు నిలవలేకపోయింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 2 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకుంది. మరో బౌలర్ ఇందూజా నందకుమార్ 3 వికెట్లు తీసి మహికాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత టార్గెట్‌ను యూఏఈ కేవలం 1.1 ఓవర్లలోనే చేజ్ చేసింది. అంటే మరో 113 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. ఓపెనర్లు ఇద్దరే ఈ టార్గెట్ చేజ్ చేసి పది వికెట్ల విజయాన్ని యూఏఈకి అందించారు. ఈ దారుణమైన ఓటమితో టోర్నీలో నేపాల్ అవకాశాలు సన్నగిల్లాయి.
ఇదీ చూడండి : పీరియడ్స్‌ను మహిళా అథ్లెట్స్ ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా?