IPL Final 2022: ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే అదరొగట్టింది గుజరాత్ టైటాన్స్. టోర్నీలో తిరుగులేని విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 29న ఈ మ్యాచ్ జరగనుంది.
IPL News: అయితే ఐపీఎల్ ఫైనల్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు హాజరవుతుండటం గుజరాత్ జట్టులో మరింత జోష్‌ను నింపనుంది. అతిపెద్ద స్డేడియం కావడం వల్ల లక్షల మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రానున్నారు. మోదీ, షా కూడా వస్తుండటంతో స్టేడియం దద్దరిల్లే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు కూడా ఇప్పుటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

Gujarat Titans: మోదీ ఈనెల 28న గుజరాత్‌ను సందర్శించనున్నారు. అమిత్ షా కూడా 29న ఓ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌కు భూమి పూజ చేసి ప్రారంభించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ కూడా అదే రోజు జరగుతుండటం వల్ల ఇద్దరూ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరోవైపు స్టేడియం వద్ద మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందితో పాటు ప్రధాని, హోం మంత్రి వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.

IPL Final Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లోనే జరగనున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు లక్షల మంది సమక్షంలో మ్యాచ్‌ను తిలకిస్తే ఆ ప్రభావం ఎన్నికల్లోనూ చూపే అవకాశం ఉంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, లఖ్‌నవూ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మే 27న క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌ను ఎదుర్కొంటుంది. అందులో గెలిచిన టీం ఫైనల్లో గుజరాత్‌ను ఢీకొంటుంది. మరి ఈ మూడు జట్లలో ఏది ఫైనల్ చేరుతుందో మే 27న తెలిసిపోతుంది. ఒకవేళ గుజరాత్, లఖ్‌నవూ ఫైనల్లో తలపడితే.. ఐపీఎల్ చరిత్రలో రెండు కొత్త జట్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కానుంది. కొత్త జట్టే ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

ఇదీ చదవండి: IPL 2022: 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'