T20 World Cup: ఆస్ట్రేలియా ఆశలు హుష్.. సెమీస్ బెర్తు ఇంగ్లాండ్‌దే.. - శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్
T20 World Cup: సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాటీ20 ప్రపంచ కప్ సూపర్ 12 గ్రూప్ -1 నుంచి సెమీస్ బెర్తులు ఖరారు అయిపోయాయి. తొలి స్థానంతో న్యూజిలాండ్, రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ సెమీస్‌కు దూసుకెళ్లిపోయాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు ఈసారి చుక్కెదురైంది. లంకపై ఇంగ్లాండ్ విజయం సాధించింది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టుకు కలిసిరాదని మరోసారి నిరూపితమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సూపర్ - 12 దశ నుంచే ఇంటిముఖం పట్టింది. తాజాగా కీలకమైన పోరులో శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో.. మెరుగైన రన్‌రేట్‌తో ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుకొంది. ప్రస్తుతం గ్రూప్ - 1 నుంచి న్యూజిలాండ్ (+2.113), ఇంగ్లాండ్ (+0.473), ఆస్ట్రేలియా (-0.173) ఏడేసి పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే నెట్‌రన్‌రేట్ ఆధారంగా న్యూజిలాండ్ అగ్రస్థానంతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆసీస్ ఇంటిముఖం పట్టింది.
ఆశలు రేపి..
ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ ఫలితంతో రెండు జట్ల భవితవ్యం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. మ్యాచ్ జరిగే కొద్దీ ఆసీస్, ఇంగ్లాండ్ శిబిరాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరికి ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో లంకపై గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవడంతో ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు ఉసూరుమన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది.
దూకుడుగా ఛేదన..
లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లాండ్ దూకుడుగా ఛేదన ప్రారంభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (28), అలెక్స్ హేల్స్ (47) తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. అయితే ఒక్కసారిగా లంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ వికెట్లను కోల్పోవడమే కాకుండా పరుగులు చేయడం గగనమైంది. మ్యాచ్‌ను ముగించడానికి 19.4వ ఓవర్ వరకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం హసరంగ.. ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చడంతో లంకతోపాటు ఆసీస్ అభిమానుల్లో కాస్త జోష్ వచ్చింది. అలాగే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే ఔట్ కావడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకూ సాగింది. అయితే బెన్ స్టోక్స్ (42*) ఆఖరివ వరకు క్రీజ్‌లో నిలిచి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. లంక కనీసం ఇంకో 20 పరుగులు అదనంగా చేసి ఉన్నా ఫలితం మరోలా ఉండేది. లంక బౌలర్లలో లాహిరు కుమార 2, హసరంగ 2, ధనంజయ డిసిల్వా 2 వికెట్లు తీశారు.
15 ఓవర్లకు 116/3.. చివరికి 141/8
ఒక దశలో లంక బ్యాటింగ్‌ను చూస్తే ఇంగ్లాండ్ బౌలర్లకు దిక్కుతోచని పరిస్థితి. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (67) ఆది నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కుశాల్ మెండిస్ (18), ధనంజయ (9), అసలంక (8) నిరాశపరిచారు. అయితే ఓవైపు నిస్సాంక రాణించడంతో 15 ఓవర్లకు లంక స్కోరు 116/3.. అప్పటికి నిస్సాంకతోపాటు హార్డ్ హిట్టర్ రాజపక్స (22) క్రీజ్‌లో ఉన్నాడు. దీంతో కనీసం 170 పరుగులైనా చేస్తుందని అంతా భావించారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో డెత్ ఓవర్లలో (16 నుంచి 20 ఓవర్లు) కేవలం 25 పరుగులను మాత్రమే సాధించిన లంక ఐదు వికెట్లను చేజార్చుకొంది. వారిద్దరితోపాటు శనక (3), హసరంగ (9), కరుణరత్నె (0) త్వరగా పెవిలియన్‌కు చేరారు. దీంతో ఆస్ట్రేలియా అభిమానుల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3.. స్టోక్స్, వోక్స్, కరన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: T20 World Cup: భారత్ x జింబాబ్వే.. సెమీస్ రేసులో నిలిచేదెవరో?