కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League) గురువారం ఆరంభమైంది. ఎప్పటిలానే మొదలైంది. ఇందులో వింతేమీ లేదు. అయితే ఈసారి లీగ్ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్లోకి స్మార్ట్ బంతి(Smart Ball Cricket) అడుగుపెట్టింది. ప్రముఖ బంతుల తయారీ సంస్థ కూకబూరాతో కలిసి స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీ అయిన స్పోర్ట్స్కోర్ దీన్ని రూపొందించింది. మరి ఈ కొత్త బంతి కథాకమామిషు ఏమిటో చూద్దామా..

ఏమిటీ?
లోపల ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చి ఈ బంతిని తయారు చేస్తారు. ఈ చిప్కున్న సెన్సార్ల సాయంతో బంతి వేగం, స్పిన్, బౌలర్ శక్తి తదితర విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు.
ఎందుకు?
నేల మీద పడి బౌన్స్ అయిన తర్వాత కూడా దాని వేగాన్ని, స్పిన్(ఓ నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుంది)ను తెలుసుకోవడమే ఈ బంతి ప్రత్యేకత. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా బౌలర్ చేతి నుంచి విడుదలైన బంతి పిచ్‌ను తాకే ముందు ఉన్న వేగాన్ని మాత్రమే కనుక్కుంటున్నారు. బంతిని వేసేందుకు బౌలర్ ఎంత శక్తి ఖర్చు చేశాడనే వివరాలూ ఈ స్మార్ట్ బంతితో తెలుస్తాయి.
ఎలా పనిచేస్తుంది?
బంతి లోపల చిప్‌కు ఉండే సెన్సార్ల సాయంతో దాని వేగాన్ని, స్పిన్నూ, బౌలర్ ఖర్చు చేసిన శక్తిని బ్లూటూత్ సాంకేతికత ద్వారా స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్, కంప్యూటర్లలో చూడవచ్చు. దీని కోసం ఓ ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ యాప్‌లో ఓ బటన్‌ను నొక్కితే బంతిలోని సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి వాటిని బ్లూటూత్ ద్వారా పంపిస్తాయి. ఆ పంపిన సమాచారం ఫోన్ లేదా కంప్యూటర్ తెరలపై సగటున 5 సెకన్లలోనే ప్రత్యక్షమవుతుంది. ఈ బంతిలోని చిప్‌లో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పనిచేస్తుంది.

ఏమైనా తేడా ఉంటుందా?
సాధారణ కూకబూరా బంతిని పోలినట్లే ఈ స్మార్ట్ బంతి ఉంటుంది. సాంప్రదాయ కూకబూరా బంతిలోని కార్క్ రబ్బరు కోర్ను తొలగించే ఆ స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్ను పెట్టారు. దీని వల్ల బంతి స్వభావంలో ఎలాంటి మార్పు రాదు. గేల్, రసెల్ లాంటి భారీ హిట్టర్లు బలంగా బాదితే బంతి పగిలిపోతుందేమోనన్న సందేహమూ అక్కర్లేదు.
ఇదీ చూడండి.. భారత రెజ్లింగ్‌ను దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్