గత ఏడాది కాలంగా సూర్య కొట్టిందల్లా సిక్సరే.. బాదిందల్లా బౌండరీయే! 2021లో అరంగ్రేటం చేసిన అతడు ఇప్పటి వరకు 39 టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 12 అర్ధ శతకాలతో 1270 పరుగులు రాబట్టాడు. సగటు 42.33 కాగా.. స్ట్రైక్‌రేటు 179 పైచిలుకే. ప్రస్తుత పొట్టి కప్పులో 5 మ్యాచ్‌ల్లో 193.96 స్రైక్‌రేటుతో 225 పరుగులు సాధించాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై అర్ధ శతకాలతో అదరగొట్టాడు. అతడి ఒక్కో ఇన్నింగ్స్ ఒక్కో ఆణిముత్యం. ఆదివారం జింబాబ్వేపై అతనాడిన ఇన్నింగ్స్ ఈ పొట్టి కప్పుకే హైలైట్. ఏబీ డివిలియర్స్‌ను మరిపిస్తూ సూర్య ఆడిన షాట్లు అసామాన్యం.
క్రీజులో యథేచ్ఛగా కదులుతూ అతడు ఆడే ర్యాంప్, స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్, డ్రైవ్‌లు ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. పేసర్ల బౌలింగ్‌లో కొట్టే ల్యాప్ స్వీప్, స్క్వేర్ స్వీప్‌లు అద్భుతాలే. సూర్య ఆడిన ప్రతి షాట్‌లో మంచి టైమింగ్ ఉంటుంది. అతడి ఇన్నింగ్స్‌లో ఆత్మవిశ్వాసం, పరిణతి కనిపిస్తున్నాయి. ఎలాంటి బౌలర్‌నైనా సాధికారికంగా ఎదుర్కొంటున్న సూర్య.. మొదటి బంతి నుంచే బ్యాటుకు పని చెబుతున్నాడు. బౌలర్ చేతిలో నుంచి బంతి పిచ్‌పై పడేలోపే రెండు, మూడు షాట్లతో సిద్ధమవుతున్నాడు.
బంతి వేగం, స్వింగ్, ఫీల్డర్ల మోహరింపునకు అనుగుణంగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. బ్యాటుకు బంతి ఎక్కడ తగిలినా అతని స్ట్రోక్‌ప్లే కారణంగా బౌండరీ ఆవలకే దూసుకెళ్తుంది. అసాధారణ స్ట్రోక్‌లతో పాటు క్రికెట్ పుస్తకంలోని సంప్రదాయ షాట్లన్నీ ఆడుతూ పరిపూర్ణ బ్యాటర్‌గా ఎదిగాడు సూర్య. మిగతా బ్యాటర్ల కంటే ఒక మెట్టు పైనే ఉన్న సూర్య గత కొన్ని నెలలుగా వేరే స్థాయిలో ఆడుతున్నాడు. టీ20 క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుత క్రికెట్లో ప్రతి బ్యాటర్ షాట్లు ఆడగలడు.
కానీ బంతి వెళ్లదనుకునే ప్రాంతాల వైపు అసాధారణ రీతిలో షాట్లు ఆడటం సూర్య ప్రత్యేకత. బౌలర్‌కు బంతి ఎక్కడ వేయాలో అర్థంకాని పరిస్థితిని తీసుకొస్తాడు. ఇక మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్ అతని మరో ప్రత్యేకత. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిలో సూర్య అందుకున్న రెండు క్యాచ్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి తడబాటు లేకుండా బంతిని లాఘవంగా ఒడిసి పట్టుకోవడం.. మెరుపు వేగంతో కూడిన ఫీల్డింగ్ సూర్యను మరింత నాణ్యమైన జట్టు ఆటగాడిగా మార్చేశాయి.
32 ఏళ్ల సూర్య ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పిచ్ ఎలా ఉన్నా.. బౌలర్ ఎవరైనా సూర్య విన్యాసాలు మాత్రం ఆగట్లేవు. ప్రస్తుత భారత జట్టులో అందరి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న ఆటగాడు సూర్య అనడంలో అతిశయోక్తి లేదు. అతని కంటే మెరుగైన బ్యాటర్ కూడా లేడు! మరి అలాంటి ఆటగాడు టీమ్‌ఇండియా టెస్టు జట్టులో ఎందుకు లేడన్నది ఇప్పటికీ నమ్మలేని నిజం. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకు సెలక్టర్లు చోటివ్వలేదు.
కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్న సూర్య కనీసం మరో రెండు, మూడేళ్లు ఇదే లయ, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. మరి అలాంటి ఆటగాడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత సెలెక్షన్ కమిటీదే. మంచి జోరుమీదున్న ఆటగాడిని ప్రోత్సహించి.. ప్రమోషన్ ఇవ్వాల్సిందీ సెలెక్టర్లే. మిడిలార్డర్‌లో సూర్య లాంటి ఆటగాడు ఉండటం జట్టుకు కూడా ఉపయోగమే. "సూర్య మూడు ఫార్మాట్ల ఆటగాడు. అయితే టెస్టులనేసరికి అతని గురించి మాట్లాడరు. కాని సూర్య టెస్టులు ఆడగల సమర్థుడు. అవకాశమిస్తే ఎంతోమందిని ఆశ్చర్యపరచగలడు" అన్న రవిశాస్త్రి అభిప్రాయం నూటికి నూరు శాతం సరైనదే.
ఇవీ చదవండి : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన సిసోదియా అనుచరుడు
ఆ లెటర్ వల్ల యువ మేయర్ 'ఆర్య'కు చిక్కులు.. రాజీనామాకు శశిథరూర్ డిమాండ్