ఐపీఎల్-2023 సీజన్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగాలీగ్ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే వార్త ఒకటి. అదేంటంటే.. వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా జరిగిన ట్రినిడాడ్ అండ్ టొబాగో(టీ అండ్ టీ) క్రికెట్ బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ I మ్యాచ్‌లో నరైన్ కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ Iకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా క్లార్క్ రోడ్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీసం ఒక్క పరుగు కూడా సమర్పించుకోకుండా ఏకంగా 7 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 7 మెయిడెన్లతో 7 వికెట్లు తీయడం విశేషం. నరైన్ సంచలన ప్రదర్శనతో ప్రత్యర్ధి జట్టు 24ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలిపోయింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఇకపోతే సునీల్ నరైన్.. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో.. 31 వికెట్లు తీశాడు. అందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.
ఇక కోల్‌కలా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ఆ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడితో పాటు మరో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ కూడా ఈ సీజన్ మెగాటోర్నీలోని పలు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఎందుకంటే ఈ బంగ్లా ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదట. మరోవైపు కేకేఆర్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. కేకేఆర్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమించబోతున్నారనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డ్.. ఆ విషయంలో కోహ్లీనే బెస్ట్!