India cricket records: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. 113 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో భారత జట్టు పలు రికార్డులు నమోదు చేసింది.
సెంచూరియన్‌లో తొలి విజయం: ఇప్పటికి ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమ్‌ఇండియా.. సెంచూరియన్‌లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఈ పర్యటనలో సెంచూరియన్‌లో తొలి విజయం సాధించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు విజయాలు: ఇటీవల టీమ్ఇండియా విదేశాల్లో అదరగొడుతోంది. 2021 జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గబ్బా మైదానంలో చారిత్రక విజయాన్ని సాధించి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది టీమ్‌ఇండియా. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్‌లో ఇంతకు ముందెన్నడూ సాధ్యం కాని విజయాన్ని అందుకుని అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో నాలుగు విజయాలు (గబ్బా, లార్డ్స్, ఓవల్, సెంచూరియన్) సాధించడం ఇది రెండో సారి. ఇంతకు ముందు 2018లో కూడా భారత్ విదేశీ పర్యటనల్లో నాలుగు విజయాలు (జొహాన్నెస్ బర్గ్, నాటింగ్ హమ్, అడిలైడ్, మెల్ బోర్న్) సాధించింది.
విదేశాల్లో బుమ్రా రికార్డు: విదేశాల్లో అత్యంత వేగంగా 23 టెస్టుల్లోనే 100 వికెట్ల మైలు రాయిని చేరుకున్న తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇతడి తర్వాతి స్థానాల్లో బీఎస్ చంద్రశేఖర్ (25 టెస్టులు), రవిచంద్రన్ అశ్విన్ (26 టెస్టులు) ఉన్నారు. ఇప్పటి వరకు 25 టెస్టులు ఆడిన బుమ్రా మొత్తం 106 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆరుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు.
ఇవీ చదవండి: