PSL Champion Shaheen Afridi: పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది అరుదైన రికార్డు సాధించాడు. టీ20 లీగ్ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ విజయం సాధించింది. ఈ మెగాలీగ్‌లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. 21 ఏళ్ల వయస్సులోనే అఫ్రిది ఈ ఘనతను అందుకోవడం విశేషం.
అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఈ రికార్డు ఉంది. అతడు 2012లో 22ఏళ్ల వయసులో బిగ్‌బాష్ లీగ్ గెలిచాడు.
కాగా, ఈ ఫైనల్ మ్యాచ్‌లో లాహోర్ జట్టు 42 పరుగులు తేడాతో గెలుపొందింది. హఫీజ్(69) టాప్ స్కోరర్. హ్యారీ బ్రూక్(41), వీస్(28), కమ్రన్ ఘులమ్(15) పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో అసీఫ్ అఫ్రిది 3, విల్లీ, ఎస్ దహాని తలో వికెట్ దక్కించుకున్నారు.
అఫ్రిది.. అంతకుముందు ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఈ సీజన్ పీఎస్ఎల్ ప్రారంభానికి ముందు లాహోర్ ఫ్రాంచైజీ అతడిని సారథిగా నియమించింది. ఈ టైటిల్ విజయంతో లాహోర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించాడు.
ఇదీ చదవండి: ఆ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాం: రోహిత్ శర్మ