విరాట్ కోహ్లీ.. సెంచరీ బాదితే ఆనందంతో కాలర్ ఎగరేసుకుతిరుగుదామని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కొంత కాలంగా విరాట్ వారి అంచనాల్ని తలకిందులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనైనా పరుగుల వరద పారిస్తాడనుకుంటే మళ్లీ నిరాశపరుస్తున్నాడు. ఇప్పటకే పూర్తైన రెండు టెస్టుల్లో కలిపి 62పరుగలు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ప్రదర్శనపై స్పందించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.
"కోహ్లీ తన పాదాల్ని సరిగ్గా కదపట్లేదు. స్టంప్స్‌కు దూరంగా జరిగి ఆడటం వల్ల త్వరగా ఔట్ అవుతున్నాడు. అతడికి మంచి ఆరంభం లభించట్లేదు. ఆరంభం బాగా లేకుంటే.. చాలా విషయాల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అదే బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలకు దారితీస్తుంది. ఆందోళన స్థాయి అధికంగా ఉండటం వల్ల.. శరీర కదలికలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది."
-సచిన్, దిగ్గజ క్రికెటర్.
చివరిరోజు ఆగస్టు 16న ముగిసిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. పేసర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల తేడాతో ఘన విజయం అందించారు. దాంతో ఈ సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది టీమ్ఇండియా. దీని గురించి సచిన్ మాట్లాడుతూ.. "షమీ, బుమ్రా భాగస్వామ్యాన్ని కీలకమైందిగా పేర్కొనడం చాలా చిన్నవిషయం. ఈ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వెల్‌డన్ షమీ, బుమ్రా" అని అన్నాడు.
ఇదీ చూడండి: IND VS ENG: రెండో టెస్టులో టీమ్ఇండియా చారిత్రక విజయం