Ravishastri Kohli test captaincy: టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు విరాట్ కోహ్లీ. దీంతో అన్ని ఫార్మాట్ల నుంచి విరాట్ సారథిగా తప్పుకొన్నట్లైంది. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ కెప్టెన్సీపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మరో రెండేళ్లు టెస్టు కెప్టెన్‌గా కొనసాగగలడని, కానీ అతడి విజయాలను చాలామంది జీర్ణించుకోలేకపోయేవారని శాస్త్రి పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ కోహ్లీ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలని తెలిపాడు.
"టెస్టుల్లో భారత్‌ను విరాట్ కోహ్లీ నడిపించగలడా అంటే.. కచ్చితంగా కనీసం మరో రెండేళ్లు అతడు టెస్టు కెప్టెన్‌గా ఉండగలడు. ఎందుకంటే వచ్చే రెండేళ్లు భారత్‌కు స్వదేశంలోనే మ్యాచ్‌లు ఉన్నాయి. పర్యటక జట్లు కూడా ర్యాంకింగ్స్ పరంగా చిన్నవే. కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగితే తన సారథ్యంలో టెస్టు విజయాల సంఖ్య 50-60కి పెంచుకునేవాడు. కానీ, చాలామంది దాన్ని జీర్ణించుకోలేరు" అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
సుదీర్ఘకాలం పాటు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లీ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. "టెస్టు ఫార్మాట్‌లో 5-6 ఏళ్ల పాటు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అందులో ఐదేళ్ల పాటు టీమ్ఇండియా టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచింది. 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించాడు. ఇలాంటి అరుదైన రికార్డును మరే భారత కెప్టెన్ సాధించలేదు. ప్రపంచంలోనూ ఇలాంటి ఘనత సాధించిన సారథులు కొంతమందే ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లపైనా గెలిచాడు. అందువల్ల, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించిన కోహ్లీ.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు ప్రకటిస్తే ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి" అని మాజీ కోచ్ తెలిపాడు.
ఇదీ చూడండి: వామిక ఫొటో వైరల్.. స్పందించిన విరుష్క జోడీ