ఒక్క ఆటగాడి గాయం రెండు జట్లను ఇబ్బంది పెడుతోంది. అటు కోహ్లీ సేనను, ఇటు గబ్బర్ జట్టును సందిగ్ధంలో పడేసింది. జట్టు యాజమాన్యం, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య అంతరాలను, అగాథాలను ఎత్తి చూపుతోంది! ఫలితంగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Subhaman Gill) గాయపడ్డాడు. అతడి స్థానంలో పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను(Devadutt Padikkal, prithvi shah) ఇంగ్లాండ్ పంపించాలని కోహ్లీసేన కోరింది. ఈ ప్రతిపాదనను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తిరస్కరిస్తోందని సమాచారం. ఇప్పటికే అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా మరో ఇద్దరు ఎందుకన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. దాంతో కోహ్లీసేన అసంతృప్తికి లోనైంది.
మరోవైపు శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. వారిద్దరూ జట్టు కూర్పులో అంతర్భాగం. ఇండియన్ ప్రీమియర్ లీగులో వీరిద్దరూ మంచి ఫామ్ కనబరిచారు. లంకలో టీమ్‌ఇండియాకు శుభారంభాలు అందించాలంటే శిఖర్ ధావన్‌తో పాటు పృథ్వీ షా ఆడటం కీలకం. ఇప్పుడు వారు పూర్తి సిరీసుకు అందుబాటులో ఉంటారా? ఉండరా? మధ్యలో ఇంగ్లాండ్ వెళ్తారా? అనే స్పష్టమైన సమాచారం లేదు. దాంతో ద్రవిడ్ స్పష్టత కోరుకుంటున్నారని తెలిసింది. మొత్తంగా ఈ విషయంలో బీసీసీఐకి సరైన కమ్యూనికేషన్ లేదని అంటున్నారు.
ఇదీ చూడండి: పంత్‌ను హెచ్చరించిన భారత జట్టు సెలక్టర్లు