punjab kings ipl 2022: ఈ ఏడాది ఐపీఎల్‌లోనైనా పంజాబ్ కప్ కొడుతుందో లేదోనని ఆ జట్టు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత పద్నాలుగు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు వెళ్లింది పంజాబ్. పంజాబ్ నిండా కీలక ఆటగాళ్లు, టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నా కప్‌ను మాత్రం అందుకోలేకపోయింది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. మరి ఈ జట్టు బలాబలాలు ఏంటని ఓసారి చూస్తే...
గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో బ్యాటర్ కేఎల్ రాహుల్. వ్యక్తిగతంగా మంచి ఇన్నింగ్స్‌లను ఆడినా.. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో రాహుల్ విఫలమయ్యాడు. మెగా వేలానికి ముందే ఈసారి కేఎల్ రాహుల్‌ను పంజాబ్ వదిలేసుకుంది. మయాంక్‌తోపాటు అన్‌క్యాప్‌డ్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. మయాంక్‌ను సారథిగా నియమించింది. మెగా వేలంలో సీనియర్లతోపాటు యువ క్రికెటర్లను కొనుగోలు చేసుకుంది.
వీరి కోసం భారీ ధర..
పంజాబ్ ఐపీఎల్ వేలంలో అత్యధికంగా లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ.11.50 కోట్లకు సొంతం చేసుకుంది. అలానే జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ కోసం భారీ మొత్తం వెచ్చించింది. బ్యాటింగ్ పరంగా శిఖర్ ధావన్, బెయిర్ స్టో, మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్‌తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక మిడిలార్డర్‌లో భనుక రాజపక్స, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ ధాటిగా ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు. పంజాబ్‌కు ఓపెనింగ్ సమస్య లేదు. మయాంక్‌తోపాటు శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. బ్యాకప్ ఓపెనర్‌గా ఎలానూ జానీ బెయిర్‌స్టో ఉన్నాడు.
పేస్ బౌలింగ్ ఓకే.. కానీ స్పిన్ విభాగమే
పంజాబ్ కింగ్స్ జట్టులో టాప్ పేసర్ కగిసో రబాడ.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బౌలర్ పంజాబ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్‌ను రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక బౌలర్ అయిన సందీప్ శర్మ, యువ క్రికెటర్ వైభవ్ అరోరాతోపాటు ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌తో పేస్ బౌలింగ్ బాగానే ఉంది. అయితే స్పిన్నర్లలో రాహుల్ చాహర్ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ బౌలర్. ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ కూడా స్పిన్ వేయగలిగినా అంతర్జాతీయ స్థాయి కాకపోవడం లోటనే చెప్పాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌కు కూడా ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసుకున్న లివింగ్‌స్టోన్ లెగ్ స్పిన్ వేయగలడు.
పంజాబ్ కింగ్స్ జట్టు: మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, శిఖర్ ధావన్, జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్ష్ పటేల్, అథర్వ తైడే, బెన్నీ హోవెల్, హర్‌ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ అగద్ బవా, రిషి ధావన్, షారుఖ్ ఖాన్, వృత్తిక్ ఛటర్జీ, అర్ష్‌దీప్ సింగ్, బాల్తేజ్ ధండా, ఇషాన్ పోరెల్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, వైభవ్ అరోరా
ఇదీ చదవండి: బంగ్లాతో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక.. ఐపీఎల్‌లో ఆటగాళ్లు లేకుండానే!