పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ మరోసారి తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో శతకాన్ని నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 73వ సెంచరీ బాదిన ఈ రన్ మెషిన్.. ఈ క్రమంలో పలు రికార్డులనూ అధిగమించాడు. మ్యాచ్ అనంతరం తన సెంచరీపై కోహ్లీ మాట్లాడాడు.
"నేను భిన్నంగా ప్రయత్నించానని అనుకోవడం లేదు. నా సన్నద్ధత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నేను బంతిని చక్కగా కొట్టానని అనుకుంటున్నాను. నేడు ఆడే టెంప్లెట్‌కు ఇది దగ్గరగా ఉంది. మాకు అదనంగా మరో 25-30 పరుగులు అవసరమని భావించాను. సెకండాఫ్‌లో పరిస్థితులను అర్థం చేసుకున్నాను. మంచి మొత్తాన్ని స్కోరు బోర్డుపై ఉంచేందుకు ప్రయత్నించాను. నేను నేర్చుకున్న విషయం ఒక్కటే.. నిరాశతో ఉంటే మీరు ముందుకు వెళ్లలేరు. మీరు పరిస్థితులను క్లిష్టంగా మార్చకూడదు. క్రీజులో భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలి. సరైన కారణాలతో ఆడాలి.. ఇదే మీ చివరి గేమ్ అన్నట్లు ఆడాలి. సంతోషంగా ఉండాలి. ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. నేను ఆనందంగా ఉంటూ ఆటను ఆస్వాదించా" అంటూ కోహ్లీ వివరించాడు.
విరాట్ కోహ్లీ(113; 87 బంతుల్లో 12×4, 1×6) ధనాధన్ సెంచరీతో చెలరేగిపోయిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 67 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది.