'విరాట్ కోహ్లీ వేసుకునే వాచ్ ధర. రూ 4కోట్లు', 'కోహ్లీ తాగే మంచి నీటి బాటిల్ ధర రూ. 700', 'క్రికెటర్ల వార్షిక ఆదాయంలో ధోనీయే టాప్!', 'రొనాల్డోకు ఉన్న కార్లలో అత్యంత చౌవకైనది మెర్సిడీస్'... ఇవీ క్రీడాకారుల గురించి మనం తరచూ వినే వార్తలు. క్రికెటర్ల నుంచి అథ్లెట్స్ వరకు.. ఇలా ఎందరో ప్రముఖుల గురించి వింటూనే ఉంటాము. ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ. కోటి తీసుకునే వారూ చాలా మందే ఉన్నారు! ఇవన్నీ వింటుంటే.. 'అబ్బా.. వీళ్లకి కష్టమంటే ఏంటో తెలియదు కదా!' అని అనుకుంటాము. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎవరూ ఊహించలేని, ఎవరితో చెప్పుకోలేని జీవితాన్ని అనేక మంది క్రీడాకారులు అనుభవిస్తున్నారు. 'మానసిక ఒత్తిడి' అనే భూతంతో నిత్యం పోరాటం చేస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ప్రముఖ టెన్నిస్ స్టార్ ఒసాకా, అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, క్రికెటర్ బెన్ స్టోక్స్ కథలు ఇందుకు ఓ ఉదాహరణ.
క్రికెట్లో..
త్వరలో ఇంగ్లాండ్- భారత్ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్ కోసం ఆటగాళ్లు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుతామా అని ఉవ్విళ్లురుతున్నారు. అయితే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం.. ఈ సమయంలో ఆటకు దూరమయ్యాడు. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పాడు. స్టోక్స్ వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచాయి.
మానసిక ఒత్తిడి అనే అంశాన్ని బయటకు చెప్పేందుకు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎవరేం అనుకుంటారోనని లోపలలోపలే కుమిలిపోతూ ఉంటారు. అయితే మానసిక ఒత్తిడి కారణంగా విరామం తీసుకున్న క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉంటాడు. 2019లోనే మ్యాక్స్‌వెల్ ఈ విషయాన్ని ప్రస్థావించాడు.
"కొంత కాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 8 నెలలుగా అటు మానసికంగా, ఇటు భౌతికంగా నా జీవతం నాశనమైపోయింది. ఇక విరామం తప్పడం లేదు."
-- గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్ట్రేలియా క్రికెటర్.
అనాడు మ్యాక్స్‌వెల్ వార్త విని బయటి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. కానీ తోటి క్రికెటర్లు మ్యాక్స్‌వెల్‌కు అండగా నిలిచారు. ముందుకొచ్చి ధైర్యంగా తన పరిస్థితిని వెల్లడించినందుకు ఈ ఆల్‌రౌండర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వారిలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఒకడు.
ఈ క్రమంలోనే తానూ మానసిక ఒత్తిడికి గురైనట్టు వెల్లడించాడు విరాట్. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాట్సమన్‌గా ఘోర వైఫల్యాన్ని చూసిన అనంతరం.. ఒకానొక సందర్భంలో 'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని' అన్న అనుభవం కలిగిందన్నాడు.
"అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు చాలా మంది బ్యాట్స్‌మెన్ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. నేను మానసికంగా ఆరోగ్యంగా లేను అని చెప్పాలనిపించింది. ఆట నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించింది. కానీ ఇలా చెబితే ఎవరు ఎలా తీసుకుంటారో మనకి తెలియదు. గ్లెన్ (మ్యాక్స్‌వెల్) చేసింది అసాధారణం. తన నిర్ణయంతో ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకానొక దశలో విసిగిపోతాం. అలాంటప్పుడు కొంత సమయం తీసుకోవడం అవసరం."
-- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
- మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, చాలాసార్లు ప్రయత్నాలు కూడా చేశానని టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఓ సందర్భంగా వెల్లడించాడు.
- ప్రపంచంలోనే గొప్ప మహిళా క్రికెటర్‌గా పేరొందిన సారా టెలర్(ఇంగ్లాండ్), 30ఏళ్ల వయస్సులోనే ఆటకు గుడ్‌బై చెప్పింది. ఇందుకు ఆమె చెప్పిన కారణం 'మానసిక ఒత్తిడి.'
- 2013-14 యాషేష్ ఓటమి అనంతరం.. తాను డ్రైవ్ చేస్తున్న కారును ఏదైనా చెట్టుకు గుద్దేయాలని అనిపించిందని ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ వెల్లడించాడు.
ఊహకందని ఆవేదన..
"చాలా భయంగా ఉండేది. కెరీర్ ప్రమాదంలో పడినట్టు అనిపించింది. డిప్రెషన్లోకి కూరుకుపోయానని అనిపించింది. గాయం అనంతర పరిస్థితులతో కాలం సాగించడం అత్యంత కష్టం."
--- 2008లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యలు
'నేను ఆనందంగా లేనని కచ్చితంగా చెప్పగలను. కాలికి రెండోసారి సర్జరీ అయినప్పుడు ఒత్తిడికి గురయ్యాను. చాలాసార్లు ఏడిచాను. దయనీయస్థితిలో ఉన్నట్టు అనిపించింది.'
-- 2011లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ వ్యాఖ్యలు.
"2003 డిసెంబర్- 2004 జూన్ మధ్య కాలంలో నేను సైకాలజిస్ట్ దగ్గర చికిత్స తీసుకున్నాను. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపించాలని అడిగాను."
-- గియాన్లుయిగి బఫ్ఫోన్, దిగ్గజ ఫుట్‌బాలర్.
"ప్రతి ఒలింపిక్స్ తర్వాత డిప్రెషన్లోకి వెళిపోతున్నట్టు అనిపిస్తుంది. 2004లో ఇలా తొలిసారి జరిగింది. ఇక ఆటలో ఉండాలనుకోలేదు. నిజానికి అశలు బ్రతికుండాలనే అనిపించలేదు. కానీ నన్ను నేను నియంత్రించుకున్నాను. ఆరోజు నా ప్రాణాన్ని బలితీసుకోకుండా ఆగిపోయినందుకు ఇప్పుడు సంతోషంగా ఉంది."
-- 2018లో అమెరికన్ దిగ్గజ స్విమ్మర్ మైఖల్ ఫెల్ప్స్ వ్యాఖ్యలు
"మీడియా నుంచి కొంత బ్రేక్ తీసుకునే హక్కు ప్రతి అథ్లెట్‌కు ఉండాలి. ఆంక్షలు విధించకూడదు. మీడియా ముందు నిలవాలంటే చాలా భయంగా ఉంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. డిప్రెషన్ తారస్థాయికి వెళుతోంది."
-- 2021 ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన కొద్ది నెలల అనంతరం జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా చేసిన వ్యాఖ్యలు.
"స్టార్ అథ్లెట్‌గా ఇక్కడికి(టోక్యో ఒలింపిక్స్) రావడం అంత సలుభమైన విషయం కాదు. ఒక్కోసారి.. ప్రపంచం బరువు అంతా నా మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నిటికన్నా మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అప్పుడే ఆటను ఆస్వాదించడానికి ఉంటుంది. అప్పుడే విజయం వరిస్తుంది. భౌతికంగా నేను బాగానే ఉన్నాను. కానీ మానసికంగా, ఎమోషనల్‌గా కష్టంగా ఉంది."
-- మానసిక సమస్యలతో వరుసగా ఒక్కో ఈవెంట్ నుంచి తప్పుకున్న అనంతరం అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ చేసిన వ్యాఖ్యలు.
ఎందుకింత కష్టం?
ఆట మీద మక్కువతో ముందు రంగంలోకి దిగుతారు క్రీడాకారులు. ఆ తర్వాత గెలవాలన్న లక్ష్యంతో నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇక అభిమానుల ఆశల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాన ఈవెంట్లలో యావత్ దేశం వారివైపే చూస్తుంది. ఇది అంత చిన్న విషయం కాదు. చాలా మంది అథ్లెట్లు ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, తమలో దాచుకోలేక సతమతమవుతున్నారు. ఇక చిన్న తప్పు జరిగితే చాలు.. సామాజిక మాధ్యమాల వేదికగా, మీడియాల్లో వారిపై రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. వీటిని తట్టుకోవడం అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు!
పరిష్కారం ఉందా?
ప్రదర్శన, వ్యక్తిగత జీవితంలోని సమస్యల కారణంగా చాలా మంది క్రీడాకారులు.. 'ప్రెషర్ కుక్కర్'లో బతుకుతున్నట్టు భావిస్తారు. అయితే వాటన్నింటికీ అతీతంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
"'ఒక మనిషిగా నేను ఎవరు? మైదానంలో ఆడుతున్న సమయంలో నేను ఎలా ప్రవర్తించాను?' అన్నవి రెండు వేరువేరు విషయాలని ముందుగా ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి. ఫలితాలు అనుకులంగా ఉన్నా.. ప్రతికూలంగా ఉన్నా.. వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదు. కానీ చాలా మంది ఇలా ఉండరు. మంచిగా ఆడుతున్న సమయంలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అంతా అద్భుతంగా ఉందనిపిస్తుంది. కానీ ఒడిదొడుకుల వేళ ఇక ప్రపంచం ముగిసిపోయిందనే భావన వారిలో కలుగుతుంది. ఇలాంటి భావాలను పక్కన పెట్టాలి."
-- ప్యాడి ఉప్టాన్, టీమ్ఇండియా మాజీ మానసిక నిపుణుడు.
మనల్ని ప్రేమించే వారి మధ్య ఉండటం వల్ల పరిస్థితి కొంతమేర కుదుటపడుతుందని దిగ్గజ అథ్లెట్లు సూచిస్తున్నారు. 'మైదానంలో ఎలా ఉన్నామనే దాని బట్టి మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మనపై వారి ప్రవర్తనను మార్చుకోరు.. వ్యక్తిగతంగా మనం ఎవరనేదే వారికి ముఖ్యం,' అని ఓ సందర్భంలో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.
భారత మహిళల జట్టు టీ20 సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక అడుగు ముందుకేసి.. మానసిక నిపుణుడిని నియమించాలని బీసీసీఐకి గతంలో విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయని.. మనసులోని భావాలను పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలనే కారణంతోనే ఈ విజ్ఞప్తి చేసినట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:- డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?