భారత క్రికెట్ జట్టు యాజమాన్యం ఏం కోరుకుంటుందో చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె తెలుసుకోవాలని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అంటున్నారు. తానేం కోరుకుంటున్నాడో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ వారికి స్పష్టంగా చెప్తూనే ఉన్నాడని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో పుజారా సానుకూలంగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు.
"భారత జట్టు వారి నుంచి ఏం కోరుకుంటుందో పుజారా, రహానె అర్థం చేసుకోవాలి. విరాట్ కోహ్లీ ఏం ఆశిస్తున్నాడో వారికి తెలుసు. పరిస్థితులు ఏంటో ఇప్పటికే కోహ్లీ బాహాటంగా చెబుతున్నాడు."
- వెంకటపతి రాజు, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులోనూ పుజారా తన పాత బ్యాటింగ్ శైలినే కొనసాగించడం ఆశ్చర్యపరిచిందని వెంకటపతి రాజు పేర్కొన్నారు. వేగంగా పరుగులు చేసేందుకు అతడు సానుకూలంగా ఆడాలని సూచించారు. మరో రెండు రోజుల్లో లార్డ్స్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. అందులో నిరూపించుకోవాల్సిన అవసరం పుజారా, రహానెకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ పుజారా, రహానె పరుగులు చేయలేదు. నయావాల్ ఎప్పటిలాగే తన పాత విధానంలోనే ఆడాడు. మరోవైపు రహానె అనవసరంగా రనౌట్లు అవుతున్నాడు. గతంలో పోలిస్తే వీరిలో పరుగుల వేగం తగ్గిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కెప్టెన్ కోహ్లీ వారిద్దరితో మాట్లాడి పరిస్థితిని వివరించాల్సిందిగా వారు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి.. ద్రవిడ్.. టీమ్ఇండియా ప్రధాన కోచ్ అవుతారా?