ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్ ముంగిట కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను(Warm up match) తడబడుతూ ఆరంభించిన భారత్.. తర్వాత పుంజుకుంది. చాన్నాళ్లుగా టెస్టు తుది జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) (101 నాటౌట్; 150 బంతుల్లో 11×4, 1×6) చక్కటి శతకంతో భారత్‌ను ఆదుకుని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (75; 146 బంతుల్లో 5×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు భారత్ 9 వికెట్లకు 306 పరుగులు చేసింది.
కౌంటీ జట్టు బౌలర్ల ధాటికి టీమ్‌ఇండియా ఒక దశలో 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 9 పరుగులకే వెనుదిరగ్గా.. మయాంక్ (38) క్రీజులో కుదురుకుంటున్న దశలో ఔటయ్యాడు. పుజారా (21), విహారి (24) కూడా విఫలమవడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, జడేజా అయిదో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. శతకం పూర్తి చేశాక రాహుల్ రిటైరవగా.. శార్దూల్ (20) అండతో జడేజా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతను ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కౌంటీ సెలక్ట్ బౌలర్లలో క్రెయిగ్ మిల్స్ (3/42) రాణించాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కోహ్లి, వైస్‌కెప్టెన్ రహానె ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా కౌంటీ జట్టులో ఆటగాళ్లు తగ్గడంతో అవేశ్, సుందర్ ఆ జట్టుకు ఆడారు.
ఇదీ చూడండి: చాహర్ వీరోచిత ఇన్నింగ్స్.. టీమ్ఇండియాదే సిరీస్