మరో వారంలో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final)లో టీమ్‌ఇండియాకు కఠిన సవాళ్లు ఎదురవుతాయని మాజీ పేసర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) పేర్కొన్నాడు. కివీస్ పేస్ బౌలింగ్ బలంగా ఉందని, దానికి తోడు ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు న్యూజిలాండ్‌లాగే ఉంటాయని చెప్పాడు. అలాగే కోహ్లీసేనకు ఇటీవలి కాలంలో ఎలాంటి టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేకపోవడం ఎదురుదెబ్బ లాంటిదని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ భారత జట్టుకు సవాళ్లు విసురుతాయని వెల్లడించాడు.
"న్యూజిలాండ్ పేస్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. కైల్ జేమీసన్ లాంటి పొడవైన ఆటగాడు తన బౌలింగ్‌తో పరీక్ష పెడతాడు. తర్వాత ట్రెంట్ బౌల్ట్, టిమ్‌సౌథీ ఒక బంతిని ఇన్‌స్వింగ్ వేస్తే మరో బంతిని ఔట్‌స్వింగ్ వేస్తారు. పిచ్ ఫ్లాట్‌గా ఉండి వికెట్లు దక్కని పరిస్థితుల్లో నీల్ వాగ్నర్ బంతి అందుకొని ప్రభావం చూపిస్తాడు. కొద్ది కాలంగా అతడు ఇదే పని చేస్తున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌లో ఆడటం వల్ల అది కూడా కివీస్ జట్టుకే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు అచ్చం న్యూజిలాండ్‌లో ఉన్నట్లే ఉంటాయి. ఇక డ్యూక్‌బాల్‌తో ఆడటం వల్ల వారి పని మరింత సులువు అవుతుంది. కాబట్టి టీమ్‌ఇండియా ముందు కఠిన సవాళ్లు ఉన్నాయి"
-అగార్కర్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్.
ఇటీవల టెస్టు క్రికెట్ ఆడకపోవడం వల్ల కూడా టీమ్‌ఇండియా సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్వదేశంలో కాకుండా కోహ్లీసేన మరెక్కడా ఆడలేదని అగార్కర్ గుర్తు చేశాడు. దాంతో భారత జట్టుకు సరైన సన్నద్ధత అవసరమని పేర్కొన్నాడు. ఇక టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ల సందర్భంగా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత బలంగా పుంజుకుందని చెప్పాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా క్లిష్ట పరిస్థితుల్లోనూ యవకులు రాణిస్తున్నారని, అదే కోహ్లీసేన(Kohli) బలమని అగార్కర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: WTC Final: 'అలాంటివే ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకం'