ICC T20 World Cup 2022 : ఆదివారం నుంచి టీ20 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. అయితే ఈ విషయమై భారత్ జట్టు సారథి రోహిత్ శర్మ స్పందించాడు. వరల్డ్ కప్ కంటే బుమ్రా ఆరోగ్యం మరింత ముఖ్యం అని చెప్పాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటూ ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
"బుమ్రా గాయాలపై మేము చాలా మంది నిపుణులను కలిశాం. కానీ వారి దగ్గర నుంచి ఆశాజనకమైన జవాబు రాలేదు. వరల్డ్ కప్ ముఖ్యమే. కానీ దానికంటే బుమ్రా ఆరోగ్యం ఇంకా ముఖ్యం. అతడికి ఇప్పుడు కేవలం 27-28 సంవత్సరాలే. అయితే, మేము అలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. ఇంకా అతడు చాలా క్రికెట్ ఆడి.. భారత్‌కు మరిన్ని విజయాలు అందించాల్సి ఉంది" అని రోహిత్ శర్మ ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత మహ్మద్ షమీ టీ20 క్రికెట్ ఆడలేదు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లు కూడా కొవిడ్ కారణంగా ఆడలేక పోయాడు. ఇక మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్ స్టాండ్‌బైలుగా ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.
ఇవీ చదవండి: పొట్టి కప్పు సమరం.. పైచేయి ఎవరిది?.. రోహిత్ సేనకు గెలిచే సత్తా ఉందా?