ఐపీఎల్ వాయిదా పడటం వల్ల విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ప్లేయర్స్లోని టెస్టు జట్టు సభ్యులు మే 11న నేరుగా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. మిగతా వారు శుక్రవారం స్వదేశానికి పయనమవనున్నారు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు సీఈఓ డేవిడ్ వైట్ తెలిపారు.
"మేము బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వారు చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే మా ఆటగాళ్లకు ముందుగానే ఆతిథ్యం ఇచ్చేందుకు అంగీకరించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు."
-డేవిడ్ వైట్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ
కివీస్ కెప్టెన్ విలియమ్సన్, కైల్ జేమిసన్, మిచెల్ సాంట్నర్‌తో పాటు ఫిజియో టామీ సిమ్సెక్ కొద్దిరోజుల పాటు దిల్లీలో ఏర్పాటు చేసిన మినీ బయోబబుల్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత వారు ప్రత్యేక విమానంలో నేరుగా ఇంగ్లాండ్‌కు పయనమవనున్నారు. పేసర్ బౌల్ట్, ట్రైనర్ క్రిస్ డొనాల్డ్సన్ మాత్రం ముందుగా వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకుని ఆ తర్వాత టెస్టు జట్టుతో కలవనున్నారు.
మొత్తం 18 మంది న్యూజిలాండ్‌కు చెందిన వారు ఐపీఎల్లో పాల్గొనగా టెస్టు జట్టు సభ్యులు మినహాయిస్తే మిగతా వారు స్వదేశాయానికి పయనమవుతారు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెక్‌కలమ్, కైల్ మిల్స్, షేన్ బాండ్, మైక్ హెసన్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, స్కాట్ కుగ్లిజెన్, జేమ్స్ పమ్మెంట్ స్వదేశానికి వెళ్లి క్వారంటైన్లో ఉండనున్నారు.
ఇంగ్లాండ్ జట్టుతో జూన్ 2న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో తలపడనుంది న్యూజిలాండ్. ఈ సిరీస్‌లో భాగంగా రెండు టెస్టులు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 18న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్‌తో తలపడనుంది.