ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ముంబయి వరుస పరాజయాల బాట పట్టడంతో రోహిత్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని సన్నీ అన్నాడు. ఈ ప్రభావం రానున్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై పడే ప్రమాదం ఉందని తెలిపాడు.
"రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సమీపిస్తున్న తరుణంలో రోహిత్‌కు బ్రేక్ అవసరం. కెప్టెన్‌గా టీమ్ఇండియాను ముందుకు నడిపించాలంటే అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఫ్రెష్ మైండ్ సెట్‌తో వెళ్లాలి. చూస్తుంటే అతడు కాస్త ఒత్తిడితో ఉన్నట్లు అనిపిస్తోంది. బహుశా డబ్ల్యూటీసీ గురించి ఆలోచిస్తున్నాడేమో. కాబట్టి హిట్‌మ్యాన్ బ్రేక్ తీసుకోవడం ఉత్తమం" అని సన్నీ అన్నాడు.
ఐపీఎల్లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు ప్లేఆఫ్ అవకాశాలను అంచనా వేసుకుంటున్నాయి. అయితే ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఆటతీరు ఈ సీజన్లో చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబయి మూడింట్లో నెగ్గి.. నాలుగింట్లో ఓడింది. ముంబయికి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో రోహిత్ ఒత్తిడి గురవుతున్నాడంటూ సన్నీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇతర టీమ్మేట్స్ ఎవరికైన జట్టు పగ్గాలు అప్పజెప్పి తను విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించాడు.
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్ విషయానికి వచ్చే సరికి తేలిపోతున్నారు. ప్రత్యేకంగా డెత్ ఓవర్లలో అనుభవంతో బౌలింగ్ చేయగల ప్లేయర్ లేకపోవడం ఆ జట్టును మరింత కలవరపెడుతోంది. ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ముంబయి చివరగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇదే జరిగింది. గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఆరు ఓవర్లలో 94 పరుగులు సమర్పింకున్నారు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి 30 బంతుల్లో 96 పరుగులు ఇచ్చుకున్నారు. ఈ గణాంకాలు ముంబయి పేలవ బౌలింగ్ ప్రదర్శనకు అద్దం పడుతున్నాయి.
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆర్చర్ సైతం ఆకట్టుకోలేక పోతున్నాడు. డెత్ ఓవర్ల హీరో బుమ్రా గాయం కారణంగా అందుబాటులో లేడు అన్న విషయం తెలిసిందే. ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరాలంటే... వారు ఇకపై ఆడే మ్యాచ్‌ల్లో అసాధారణ రీతిలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాలి. మరోవైపు రోహిత్ ఆటతీరు పట్ల అభిమానులు అసహనం వ్యక్త పరుస్తున్నారు. ఈ సీజన్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్ కేవలం 181 పరుగులే చేశాడు. ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో.. అతడి ఫామ్ ఇలాగే కొనసాగితే ఎలా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైరవుతున్నారు.
ఇవీ చదవండి:
ఐపీఎల్లో అర్జున్ తెందూల్కర్ తొలి సిక్స్.. ట్రోల్స్ పట్టించుకోవద్దని బ్రెట్‌లీ సలహా !
IPL 2023 GT VS MI : చెలరేగిన మిల్లర్, అభినవ్.. ముంబయిపై టైటాన్స్ ఘనవిజయం!