రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌లో మునుపెన్నడూ లేనివిధంగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రాత్రి వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరులో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.. ఆర్సీబీకి ఈసారి కప్ సాధించే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు.

"ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ హర్షం వ్యక్తం చేశారు. కోహ్లీ, దేవదత్ షాట్లు ఎంచుకున్న తీరును మెచ్చుకున్నాడు. ఆయన ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ.. "విరాట్, పడిక్కల్ కాంబినేషన్ కుడి, ఎడమ చేతివాటం కావడం వల్ల రాజస్థాన్ బౌలర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. దేవదత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం. వీరిద్దరి కాంబినేషన్ బాగుండటం.. కోహ్లీ ఓపెనర్‌గా స్థిరపడటానికి ఉపకరిస్తుంది. వీరు చూడముచ్చటైన షాట్లతో పాటు పవర్ పుల్ షాట్లు ఆడుతున్నారు. ప్లేస్‌మెంట్ కూడా బాగుంది. కొన్ని కష్టమైన బంతులను కూడా ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తున్నారు. వీరిది అసాధారణ ప్రదర్శన. ఇన్నేళ్లు ఆర్సీబీ బాగానే ఆడినా.. ఈసారి మాత్రం ‘'రియల్ ఛాలెంజర్స్ బెంగళూరు'’గా మారుతోంది. ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది."
-సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్
అదే విధంగా పడిక్కల్ గురించి మాట్లాడుతూ.. "పడిక్కల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. వాటిల్లో భారీ శతకాలు కూడా సాధించాడు. దేశవాళీ టీ20 టోర్నీల్లోనూ గణనీయమైన పరుగులు సాధించాడు. అతడు ఏ ఫార్మాట్‌లోనైనా భారత్ తరఫున ఆడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు అవసరమైన సత్తా అతని దగ్గర ఉంది" అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.