ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. ప్రత్యర్థి పంజాబ్‌కు 175 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ జట్టులో డుప్లెసిస్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు రెండు వికెట్ల పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ శుభారంభం చేశారు. ఓపెనర్లలిద్దరూ అదరగొట్టారు. బంతులను బౌండరీలు దాటించారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్.. ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 17 ఓవర్‌లో మొదటి బంతికి విరాట్ కోహ్లీ (59), తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ (0) డకౌటయ్యాడు. కోహ్లీ.. వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇవ్వగా.. మ్యాక్స్‌వెల్ అథర్వ తైడేకు చిక్కాడు. ఆరంభం నుంచి దుమ్మురేపిన ఓపెనర్ డుప్లెసిస్ ఔటయ్యాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 18 ఓవర్‌లో రెండో బంతికి సిక్స్ బాదిన డు ప్లెసిస్ (84).. తర్వాతి బంతికే లాంగాఫ్‌లో సామ్ కరన్‌కు చిక్కాడు. తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్(7) నిరాశపరిచాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19 ఓవర్‌లో ఐదో బంతికి ఫోర్ బాదిన డీకే.. చివరి బంతికి అథర్వ తైడేకు క్యాచ్ ఇచ్చాడు. మహిపాల్ లోమ్రోర్ (7*), షాబాజ్ అహ్మద్ (5*) నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా ఆర్సీబీ 174 పరుగులు సాధించింది.
400 ఫోర్లు..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు నాలుగు వందల ఫోర్లు బాదేశాడు.
మొహాలీలో డుప్లెసిస్ అదుర్స్..
మొహాలీ స్డేడియంలో డుప్లెసిస్‌కు అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో 84 పరుగులు సాధించి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు ఫోర్లు, ఐదు సిక్సులతో అదరగొట్టాడు. ఇంతకముందుకు ఈ స్టేడియంలో డుప్లెసిస్ బెస్ట్ స్కోర్లు ఇవే..
- 2015- 55(41)
- 2016- 67(53)
- 2019- 96(55)
- 2023- 84(56)
IPLలో RCBకి అత్యధిక ఓపెనింగ్స్:
- 181* - విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ vs రాజస్థాన్- 2021
- 167 - క్రిస్ గేల్, తిలకరత్నే దిల్షాన్ vs పుణె, బెంగళూరు- 2013
- 148 - విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ vs ముంబయి, బెంగళూరు- 2023
- 147 - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ vs పంజాబ్, బెంగళూరు- 2016
- 137 - విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ vs పంజాబ్, మొహాలీ- నేటి మ్యాచ్