sehwag jadeja csk: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరువవుతోంది. సీజన్లో తీవ్రంగా నిరాశపరుస్తున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఒకటిగా నిలుస్తోంది. జడేజా సారథ్యంలో బరిలోకి దిగిన సీఎస్కే ప్రయాణం.. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. బుధవారం ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడమే సీఎస్కే చేసిన మొదటి తప్పు అని అభిప్రాయపడ్డాడు.
"ధోనీ కెప్టెన్సీ చేయడని సీజన్ ప్రారంభంలో ప్రకటించడమే సీఎస్కే చేసిన తప్పు. జడేజాను కెప్టెన్‌గా నియమిస్తే.. అతడిని సీజన్ పూర్తయ్యే వరకు కొనసాగించాల్సింది. చెన్నై తుది జట్టులో ఆడే 11 మంది ప్రతిసారి మారుతూ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఆరంభంలో పరుగులు చేయలేదు. పేలవంగా సీజన్ ఆరంభించారు. బ్యాటర్లు విఫలమయ్యారు. ధోనీ ముందు నుంచి సారథిగా ఉండి ఉంటే.. సీఎస్కే ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయేది కాదు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Jadeja form fleming: మరోవైపు, జడేజా ఫామ్‌పై సీఎస్కే కోచ్ స్పందించాడు. ఇప్పటివరకు అన్ని విభాగాల్లో సీఎస్కే బాగానే రాణించిందని చెప్పుకొచ్చారు. "టీ20ల్లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. క్రీజ్‌లో కుదురుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఆ ప్లేస్‌లో ఆడటం సులువైన విషయం కాదు. ఇదే జడేజా విషయంలో జరిగింది. కాబట్టే, అతడి ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇక రాబోయే మ్యాచుల్లో బ్యాటింగ్ ఆర్డర్‌పై దృష్టిపెట్టి ఫలితాలను రాబడతాం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచులోనూ విజయానికి చేరువగానే వచ్చాం. అన్ని విభాగాలు బాగానే రాణించాయి. అయితే ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే తప్పక గెలిచే వాళ్లం" అని ఫ్లెమింగ్ వివరించాడు.
టీ20 లీగ్‌లో చెన్నై ఏడో పరాజయం నమోదు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 160/8 స్కోరుకే పరిమితమైంది. కీలక సమయంలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ తక్కువ పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరారు. రవీంద్ర జడేజా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సారథ్య బాధ్యతలు భారంగా మారడంతోనే రాణించలేకపోతున్నాడని భావించినప్పటికీ.. ఆ కారణం సహేతుకంగా అనిపించడం లేదు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడానూ పెద్దగా ఆడిందేమీ లేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లను ఆడి 116 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. ధాటిగా ఆడటంలో పూర్తిగా విఫలమవుతున్నాడు.
ఇదీ చదవండి: ఆ ఒలింపిక్స్‌లో తెలుగోడి సత్తా... స్వర్ణం గెలిచిన షూటర్