రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం.. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్. 2019 సీజన్ కోసం సీఎస్కే యాజమాన్యం తొలిసారి అతడిని ఎంపిక చేసింది. అయితే ఆ సీజన్‌లో డగౌట్‌కే పరిమితం చేసింది. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో (Ruturaj Gaikwad ipl records) నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్‌లో చివర్లో ఆరు మ్యాచ్‌లే ఆడినా 204 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఆ టోర్నీ ఆరంభానికి ముందే కొవిడ్ బారిన పడిన రుతురాజ్ తర్వాత కోలుకుని రాణించడం విశేషం.
5, 5, 10, 64, 33, 75, 4, 88, 38, 40, 45, 101, 13, 12, 70, 32.. ఈ సీజన్‌లో రుతురాజ్ సాధించిన స్కోర్లివి. ఆరంభంలో పెద్దగా అంచనాలు లేని ఈ యువ ఓపెనర్ తర్వాత గేర్ మార్చాడు. వరుసగా రాణిస్తూ జట్టు విజయాల్లో (Ruturaj Gaikwad cricket records) కీలక పాత్ర పోషించాడు. చివరికి క్వాలిఫయర్-1లో దిల్లీపై చెలరేగి చెన్నైని ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కోల్‌కతాతో జరిగిన ఫైనల్లో మరోసారి డుప్లెసిస్(86)తో శుభారంభం చేశాడు. ఈ సీజన్‌లోనే అత్యధిక పరుగులు(635 చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో తన రెండో టోర్నీలోనే ఆరెంజ్ క్యాప్ అందుకోవడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అలాగే ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా’ ఎంపికై అందరి మన్ననలు పొందుతున్నాడు.
భరోసా కల్పిస్తే చెలరేగుతాడు..
సహజంగా ఏ జట్టులోనైనా ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో సరిగా ఆడకపోతేనే రెండో మ్యాచ్‌కి జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటిది ఆరంభంలోనే వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైనా చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (highlights csk vs kkr) అతడికి అవకాశం ఇచ్చాడు. దాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న గైక్వాడ్.. సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడాడు. మరీ ముఖ్యంగా లీగ్ దశలో రాజస్థాన్‌తో పోరుకు ముందు కెప్టెన్ చివరి వరకూ క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయమని సూచించడంతో తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీశాడు. దాంతో శతకంతో బాది.. తనని ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తానని చెప్పకనే చెప్పాడు. తాను విఫలమైనప్పుడు ధోనీనే అండగా నిలిచాడని.. ప్రశాంతంగా ఆడమని సలహాలిచ్చాడని రుతురాజ్ ఓ సందర్భంలో చెప్పాడు.
ఏ జట్టుపై ఎలా చెలరేగాడు..
ఈ సీజన్‌లో రుతురాజ్ మొత్తం 635 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌పై రుతురాజ్ (101నాటౌట్; 60 బంతుల్లో 9x4, 5x6) శతకం బాది తన సత్తా ఏంటో చూపించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా అతడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అలాగే టోర్నీ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా నాలుగో మ్యాచ్‌లో కోల్‌కతాపై చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో 64 పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలిసారి మెరిశాడు. ఇక తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరుపై 33 పరుగులు సాధించాడు. మళ్లీ సన్‌రైజర్స్‌పై 75 పరుగులతో చెలరేగాడు. అనంతరం యూఏఈ లెగ్‌లో ముంబయితో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 88 పరుగులు సాధించి ఈ పొట్టి ఫార్మాట్‌లో తానూ శతకం బాదగలనని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో మూడు మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్‌పై విశ్వరూపం చూపించాడు.
కెరీర్ ఎలా సాగింది?
మహారాష్ట్రలోని పుణెకు చెందిన రుతురాజ్.. 1997 జనవరి 31న జన్మించాడు. మహారాష్ట్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 2016-17 రంజీ ట్రోఫీతో కెరీర్ ప్రారంభించాడు. 2018లో ఇండియా-బి జట్టుకు, అదే ఏడాది ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. ఇక 2019లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, తొలి సీజన్ కావడంతో అతడు డగౌట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంలోనే రుతురాజ్ కరోనా బారినపడి కోలుకున్నాడు. అయితే, పలు మ్యాచ్‌ల్లో అతడికి అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడలేదు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమవడంతో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌ల్లో అవకాశం దక్కింది. దాంతో ఆరు మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ మూడు అర్ధశతకాలతో మొత్తం 204 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఈ సీజన్‌లో ఎలా చెలరేగిపోయాడో పైన స్కోర్లను బట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యూఏఈ లీగ్ ప్రారంభానికి ముందు రుతురాజ్ జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అక్కడ 35 పరుగులే చేసి నిరుత్సాహపరిచాడు.
లవ్ ఎఫైర్‌పై..
రుతురాజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. బాలీవుడ్ నటి సాయాలీ సంజీవ్‌తో లవ్ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ వదంతులేనని ఓ సందర్భంలో తేల్చిచెప్పాడు. బౌలర్లు మాత్రమే తన వికెట్‌ను పడగొట్టగలరని, వారే తనని క్లీన్ బౌల్డ్ చేస్తారని సరదాగా ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కూడా చేశాడు.
రుతురాజ్ గురించి మరికొన్ని విశేషాలు
- రుతురాజ్‌కి క్రికెట్ ఎంత ఇష్టమో చెప్పాలంటే.. అతడు ఎప్పుడు క్రికెట్ అకాడమీలో చేరాడో చెబితే సరిపోతుంది. అతడు 12 ఏళ్ల వయసులోనే వెంగ్‌సర్కార్ క్రికెట్ అకాడమీలో చేరిపోయాడు.
- ఇప్పుడు ఐపీఎల్‌లో అదరగొడుతున్న రుతురాజ్ దేశవాళీ క్రికెట్‌లోనూ అదే జోరు ప్రదర్శించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో వరుసగా రెండేళ్లు అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ ఈ సీఎస్కే ఓపెనరే కావడం విశేషం.
- క్రికెటర్లంటే కేవలం ఇదొక్క ఆట మీదే దృష్టిసారిస్తారని అనుకోవడం సరికాదు. ఎందుకంటే రుతురాజ్‌కు క్రికెట్‌తోపాటు టెన్నిస్ కూడా అమితాసక్తి. క్రికెటర్ కాకపోయి ఉంటే ఏం చేస్తావని ఓ సందర్భంలో అడిగినప్పుడు టెన్నిస్ ఆడేవాడినని బదులిచ్చాడు.
- క్రీజులో కుదురుకుంటే బౌలర్ల ఎదురుదాడి చేసే రుతురాజ్ పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా. అయితే, ఇంత వరకూ అతడికి ఐపీఎల్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.
- ఖాళీ సమయాల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి చూపిస్తాడు. నెట్‌ఫ్లిక్స్‌లోని ‘నార్కోస్’ షో మరీమరీ ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు.
ఏమంటే ఇష్టం?
- సెల్ఫీమ్యాన్: డిఫరెంట్‌గా సెల్ఫీలు తీసుకోవడం ఇష్టం
- ఇష్టమైన కాంబినేషన్: బిస్కెట్లతో కాఫీ తాగడం
- ఎంజాయ్‌మెంట్ స్పాట్: బీచ్‌లకు వెళ్లడం
- మరిచిపోలేని సంఘటన: 2016లో రంజీలో అడుగుపెట్టినప్పుడు వేలికి దెబ్బతగిలింది. అప్పుడు గాయం పట్టీ మీద ఎంఎస్ ధోనీ సంతకం చేయడం మరిచిపోలేని సంఘటన
- ఆల్‌టైమ్ ఫేవరైట్: ఇండియా జెర్సీ వేసుకోవడం
- ఇష్టమైన క్రికెటర్: సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ
- సరదా కాలక్షేపం: సరదాగా స్నేహితులతో వాలీబాల్ ఆడాలి
- ఫిట్‌నెస్‌పై అభిప్రాయం: అత్యంత ప్రాధాన్యత
- సూపర్ పిక్: ప్రాక్టీస్ సందర్భంగా ఎంఎస్ ధోనీతో దిగిన ఫొటో
ఇదీ చదవండి:IPL 2021 records: చెన్నై ఓపెనర్లు సరికొత్త రికార్డు