చెన్నై చెపాక్ స్టేడియంలోని పిచ్‌లు బ్యాట్స్‌మెన్ ఆడలేనివి కావని అంటున్నాడు ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్దనే. పిచ్ కాస్త నెమ్మదిగా స్పందించడం వల్ల సవాళ్లు విసురుతాయని అన్నాడు. ఎందుకంటే చెపాక్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా అందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఐదుసార్లు విజయం సాధించాయని తెలిపాడు. అలాగే గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 204 పరుగుల అత్యధిక స్కోర్ సాధించిందని గుర్తుచేశాడు.
"చెన్నై పిచ్‌లు ఆడలేనివేం కావు. అవి మంచివే, అయితే సవాళ్లతో కూడుకున్నవి. ఆ పరిస్థితులకు అలవాటు పడటం ఏ బ్యాట్స్‌మన్‌కైనా, జట్టుకైనా ఎంతో ముఖ్యం. మేం నిలకడగా ఆడుతూ అలవాటు పడుతున్నాం. అక్కడి పిచ్‌లు పరీక్ష పెట్టినా.. మా బౌలర్లు పరిస్థితులకు అలవాటు పడ్డారు అని ముంబయి కోచ్ వివరించాడు".
- మహేలా జయవర్దనే, ముంబయి ఇండియన్స్ కోచ్
అలాగే తమ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే బౌలింగ్ చేస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో అతడు ఇబ్బంది పడ్డాడని, దాంతో ప్రస్తుతం భుజం నొప్పితో సతమతమౌతున్నాడని జయవర్దనే తెలిపాడు. పాండ్యా స్వతహాగా బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చినప్పుడు తప్పకుండా అతడి సేవలు వినియోగించుకుంటామని చెప్పాడు. తాము కావాలనే పాండ్యా బౌలింగ్ ఇవ్వడం లేదనేది నిజం కాదన్నాడు.
ఇక గత రెండు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసిన రాహుల్ చాహర్‌పై స్పందిస్తూ ఏటా బాగా మెరుగవుతున్నాడని మెచ్చుకున్నాడు. 2019లో తొలిసారి అతడికి అవకాశం ఇచ్చామని, దాంతో అతడేంటో నిరూపించుకున్నాడని జయవర్దనే పేర్కొన్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లోనూ బాగా రాణించాడన్నాడు. అయితే, మధ్యలో ఒడుదొడుకులతో నిలకడగా వికెట్లు తీయలేకపోయాడని గుర్తుచేశాడు. అతడింకా యువ క్రికెటర్.. కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకునే స్థాయిలో ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే గత రెండు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీయడం సంతోషంగా ఉందన్నాడు. ముఖ్యంగా స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యాతో కలిసి వికెట్లు పంచుకోవడం బాగుందని ప్రశంసించాడు.
ఇదీ చూడండి: ఆస్పత్రి నుంచి మురళీధరన్ డిశ్చార్జ్