IPL RCB relation with April 23 date: టీ20 లీగ్‌లో బెంగళూరుకు ఏప్రిల్ 23వ తేదీకి అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇదే రోజు టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అలానే అత్యల్ప స్కోరును చేసిన జట్టుగా అప్రతిష్ఠపాలైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎప్పుడనేది మీరూ తెలుసుకోండి..
2013 ఏప్రిల్ 23: టీ20 లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరు రికార్డు సృష్టించింది. అప్పటి పుణె వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (175) భారీ శతకం సాధించి ఔరా అనిపించాడు. ఇప్పటికీ గేల్‌దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. పుణెను 133 పరుగులకే పరిమితం చేసిన బెంగళూరు 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
2017 ఏప్రిల్ 23: భారీ స్కోరు చేసి రికార్డు సృష్టించిన బెంగళూరు పేరిట మరో చెత్త రికార్డూ ఉండటం గమనార్హం. టీ20 లీగ్‌లో అత్యంత తక్కువ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. 2017 ఏప్రిల్ 23వ తేదీన కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఛేదన సందర్భంగా కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం నెత్తినేసుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరర్ కేదార్ జాదవ్ (9). ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
2022 ఏప్రిల్ 23: ప్రస్తుత లీగ్‌లో టైటిల్ నెగ్గేందుకు అవకాశం ఉన్న జట్లలో బెంగళూరు ఒకటి. అలాంటిది మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుంది. బౌలింగ్‌పరంగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న హైదరాబాద్ ఎదుట తలవంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు కేవలం 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఈమ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. అనంతరం హైదరాబాద్ కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 8 ఓవర్లలోనే లక్ష్యం పూర్తి చేసింది.
ఇదీ చూడండి: ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది రెండోసారి