IPL 2022 KL Rahul Trent Bouli: సహచర ప్లేయర్ జిమ్మీ నీషమ్ ఇచ్చిన సలహాతోనే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చినట్లు తెలిపాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే లఖ్‌నవూ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి రెండు బంతుల్లో స్టన్నింగ్ డెలివరీతో రాహుల్‌ను క్లీన్ బౌల్డ్, కృష్ణప్ప గౌతమ్‌ను స్వింగర్‌తో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా రాహుల్ ఔటైనా తీరు క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
విజయానంతరం మాట్లాడిన బోల్ట్.. "పవర్ ప్లేలో కొత్త బంతితో వీలైనన్నీ వికెట్లు తీయడమే నా పాత్ర. వీరిద్దరిని ఔట్ చేయడం ఆనందంగా ఉంది. రాహుల్ గొప్ప ఆటగాడు. అతడిని ఔట్ చేయాలని బ్రేక్ ఫాస్ట్ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఇది నా సహచర జిమ్మీ నీషమ్ ప్రణాళిక. అతడే దీన్ని రచ్చించాడు. యువ పేసర్ కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్కస్ స్టోయినిస్‌ను బాగా కట్టడి చేశాడు. మొత్తంగా మా జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇక నా విషయానికొచ్చేసరికి బౌలింగ్ కన్నా బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలేమో." అని చెప్పాడు.
తాను ఔటైన తీరుపై రాహుల్ మాట్లాడుతూ.. "నేను ఆ బంతిని చూడలేదు. చూస్తే ఏదో ఒకటి చేసేవాడిని. ఆ క్రెడిట్ అంతా బౌల్ట్‌కే దక్కుతుంది. అదొక అత్యుత్తమ డెలివరీ. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా మాది బలమైన జట్టే. బ్యాట్, బంతితో రాణించే సత్తా మాకుంది. 20 పరుగులలోపే మూడు వికెట్లు కోల్పోయినా మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ, మా జట్టులో ఒక మేటి భాగస్వామ్యం నిర్మించలేకపోయాం. చివర్లో స్టాయినిస్ మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. అతడి ఆట మెచ్చుకోదగినది. ఈ సీజన్‌లో అతడికి ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఈ ప్రదర్శనతో మంచి ఆత్మవిశ్వాసం సంపాదించుకుంటాడు. అతడిని చివరిదాకా బ్యాటింగ్‌కు పంపకపోవడం కూడా మా ప్రణాళికలో భాగమే. చివర్లో అతడు ఎంత ప్రమాదకారో మాకు తెలుసు. అందుకే అలా పంపించాం. మా వ్యూహాలతో ప్రత్యర్థులకు అర్థంకాని విధంగా ఆడాలనుకుంటాం. కానీ, ఈ మ్యాచ్‌లో మేం వేసుకున్న ప్రణాళికలను అమలుచేయలేకపోయాం. ఈ ఓటమి ఓ గుణపాఠంలాంటిది" అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: ఐపీఎల్లో తొలి 'రిటైర్డ్ ఔట్'.. చాహల్ అరుదైన ఘనత