ఐపీఎల్‌లో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ (6,283) పరుగులతో అందరికన్నా ముందుండగా.. శిఖర్ ధావన్ (5,784), రోహిత్ (5,611) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ చోటు సాధించడం విశేష. అయితే, ఇదే టోర్నీలో అత్యధిక సిక్సులు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో మాత్రం హిట్‌మ్యాన్ ఒక్కడే స్థానం దక్కించుకొన్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-15వ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ రెండు జాబితాల్లో ఎవరెవరు టాప్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
అత్యధిక బౌండరీల వీరులు

శిఖర్ ధావన్: ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ధావన్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడగా 4,567 బంతులు ఎదుర్కొని 5,784 పరుగులు చేశాడు. అందులో 654 ఫోర్లు, 124 సిక్సర్లు కొట్టాడు.
విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు 207 మ్యాచ్‌ల్లో 4,835 బంతులు ఎదుర్కొని 6,283 పరుగులు చేశాడు. అందులో 546 ఫోర్లు, 210 సిక్సర్లు ఉన్నాయి.

డేవిడ్ వార్నర్: ఇన్నాళ్లూ సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉండి ఇప్పుడు దిల్లీ జట్టుకు తరలిపోయిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 3,893 బంతులు ఎదుర్కొని.. 5,449 పరుగులు చేశాడు. వాటిలో 525 బౌండరీలు, 201 సిక్సర్లు సంధించాడు.

సురేశ్ రైనా: ఇక ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా నాలుగో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 205 మ్యాచ్‌ల్లో 4,402 బంతులు ఎదుర్కొని 5,528 పరుగులు చేశాడు. అతడు 506 బౌండరీలు, 203 సిక్సర్లు సాధించాడు.

రోహిత్ శర్మ: ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్‌కు గొప్ప రికార్డు ఉంది. అతడు ఇప్పటి వరకు 213 మ్యాచ్‌లు ఆడి.. 4,303 బంతులు ఎదుర్కొని 5,611 పరుగులు చేశాడు. అందులో 491 ఫోర్లు, 227 సిక్సర్లను నమోదు చేశాడు.

అత్యధిక సిక్సర్ల ధీరులు..
క్రిస్‌గేల్: ఇక ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో బ్యాటింగ్ లెజెండ్ క్రిస్‌గేల్ అందరికన్నా ముందున్నాడు. అతడిని ఇప్పట్లో అందుకోవడం ఎవరికైనా కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే అతడు ఇప్పటివరకు 142 మ్యాచ్‌లు ఆడి 3,333 బంతులు ఎదుర్కొని 4,965 పరుగులు చేశాడు. అందులో 405 బౌండరీలు, 357 సిక్సర్లు సాధించడం విశేషం.

ఏబీ డివిలియర్స్: గతేడాది వరకూ ఆర్సీబీలో కీలక బ్యాట్స్‌మన్‌గా ఆడిన ఏబీ డివిలియర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 184 మ్యాచ్‌ల్లో 3,403 బంతులు ఎదుర్కొని 5,162 పరుగులు చేశాడు. అందులో 413 ఫోర్లు, 251 సిక్సర్లను దంచికొట్టాడు.

రోహిత్ శర్మ: అత్యధిక బౌండరీల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ సిక్సర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 227 సిక్సర్లు సాధించాడు. ఇదే సీజన్‌లో మరో 25 సిక్సర్లు సంధిస్తే డివిలియర్స్‌ను అధిగమించి రెండోస్థానంలోకి దూసుకెళ్తాడు.

ఎంఎస్ ధోనీ: ఐపీఎల్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, మొత్తంగా నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అతడు మొత్తం 220 మ్యాచ్‌లు ఆడి 3,494 బంతులు ఎదుర్కొని 4,746 పరుగులు చేశాడు. అందులో 325 బౌండరీలు, 219 సిక్సర్లు ఉన్నాయి.

పొలార్డ్: ఇక ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ స్టార్ హిట్టర్ కీరణ్ పొలార్డ్ ఐదో స్థానంలో నిలిచాడు. అతడు చాలా సీజన్లుగా ఆ జట్టుతోనే కొనసాగుతూ అత్యంత కీలక విదేశీ ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. మొత్తం 178 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 2,182 బంతులు ఎదుర్కొని 3,268 పరుగులు చేశాడు. అందులో 212 ఫోర్లు, 214 సిక్సర్లు సాధించాడు.

ఇదీ చదవండి: అతితక్కువ స్కోర్లతోనే గెలిచి.. అసలైన ఐపీఎల్ మజా అందించి..