ఐపీఎల్ అంటేనే ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు టీమ్‌ఇండియాలోకి ఎంపికయ్యే అవకాశం కల్పించే ఓ గొప్ప వేదిక. ప్రస్తుత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదిగిన చాలా మంది అలా వచ్చినవారే! ఈ పదమూడో సీజన్‌లోనూ తమ నైపుణ్యాలతో సత్తాచాటిన కొంత మంది భారత కుర్రాళ్లు.. జాతీయ జట్టు తలుపు తట్టే దిశగా సాగుతున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోగా.. తాము కూడా అదే బాటలో ప్రయాణించి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తామంటున్నారు ఈ ఆటగాళ్లు. మరి ఆ క్రికెటర్లు ఎవరూ? ఈ సీజన్‌లో వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో చూసేద్దాం.
పడిక్కల్ మెరుస్తున్నాడు
దేశవాళీల్లో మెరుపులతో ఐపీఎల్-13కు ముందే 20 ఏళ్ల దేవ్‌దత్ పడిక్కల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతణ్ని బెంగళూరు ఓపెనర్‌గా పంపించింది. తొలిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాననే భయం, బెరుకు లేకుండా నిలకడతో పరుగులు చేసుకుంటూ వెళ్తున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 472 పరుగులు చేసిన అతను తన జట్టు ప్లేఆఫ్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అయిదు అర్ధశతకాలు నమోదు చేసిన ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్.. భారత్‌కు ఆడకుండా అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్‌గా వచ్చి క్రమం తప్పకుండా పరుగులు చేస్తున్న పడిక్కల్.. ఆర్సీబీ ప్రధాన బ్యాట్స్‌మెన్ కోహ్లీ, డివిలియర్స్‌పై భారం తగ్గిస్తున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే మరో ఏడాదిలోపు కచ్చితంగా జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.
సత్తాచాటుతున్న సూర్య కుమార్
సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయంటే.. అతనెలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా ఆడిన ప్రతి ఐపీఎల్‌లో సీజన్‌లోనూ సూర్య అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 410 పరుగులు చేసి.. ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కొన్నేళ్లుగా దేశవాళీల్లో, ఐపీఎల్‌లో అతను రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఆ కసితో సెలక్షన్ జరిగిన తర్వాతి రోజే అతను ఆర్సీబీపై 43 బంతుల్లోనే అజేయంగా 79 పరుగులు చేశాడు. సూర్యను విస్మరించడంపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న సెలక్షన్ కమిటీ రాబోయే సిరీస్‌ల కోసం సూర్యకుమార్‌ను పరిగణలోకి తీసుకోకతప్పదు. అలాగే ముంబయికే ఆడుతున్న ఇషాన్ కిషాన్ కూడా ఈ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీపై 99 పరుగులు చేసిన ఈ 22 ఏళ్ల కుర్రాడు..12 మ్యాచ్‌ల్లో 42.55 సగటుతో 428 పరుగులు చేశాడు.
చివర్లో దంచికొట్టిన గైక్వాడ్
సీజన్ ఆరంభానికి ముందు అంచనాలు రేకెత్తించిన ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. కానీ కరోనా అతణ్ని దెబ్బకొట్టింది. దాని నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా వెంటనే లయ అందుకోలేకపోయాడు. ధోనీని మెప్పించలేకపోయాడు. కానీ సీజన్ ముగిశాక ధోనీనే.. అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. చెన్నై ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాక అవకాశాలందుకున్న అతను వరుసగా మూడు అర్ధశతకాలు సాధించాడు. భారత్‌కు ఆడని కుర్రాళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు అతనే. 6 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 204 పరుగులు చేసిన రుతురాజ్.. నిలకడ కొనసాగిస్తే టీమ్‌ఇండియా తలుపు తట్టినట్లే.
యార్కర్ కింగ్ నటరాజన్
ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో సీజన్ మధ్యలోనే దూరమవడం వల్ల ఢీలాపడ్డ సన్‌రైజర్స్ పేస్ దళానికి నటరాజన్ బలంగా మారాడు. ఓవర్లో ఆరుకు ఆరు బంతులనూ కచ్చితమైన యార్కర్లుగా మలిచే సామర్థ్యంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. నిలకడైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేయగల అతను లీగ్ దశ ముగిసే సరికి 14 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ 29 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ సన్‌రైజర్స్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో కీలకం కానున్నాడు.
తెవాతియా మెరిశాడు
రాజస్థాన్ ఆటగాడు రాహుల్ తెవాతియా.. బంతితో, బ్యాట్‌తో రాణిస్తూ మరో మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగే దిశగా సాగుతున్నాడు. పంజాబ్‌పై 224 పరుగుల ఛేదనలో అతడి విధ్వంసం అందరికి గుర్తుండే ఉంటుంది. తర్వాత కూడా చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.
భలే ఛాన్స్
రెండేళ్ల ముందు వరకూ తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టని వరుణ్ చక్రవర్తికి భలే ఛాన్స్ దక్కిందనే చెప్పాలి. అతను భారత జట్టుకు ఎంపికవుతాడని ఈ సీజన్‌కు ముందు ఊహించే ఉండడు. కానీ లీగ్‌లో తన మిస్టరీ స్పిన్‌తో అతను చేసిన మాయ సెలక్టర్లను మెప్పించింది. దిల్లీపై అయిదు వికెట్లు తీసిన ఈ కోల్‌కతా లెగ్‌స్పిన్నర్.. టీమ్‌ఇండియాలోకి తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. బంతుల్లో వైవిధ్యంతో పాటు గూగ్లీ, లెగ్‌కట్టర్‌లను సమర్థంగా వేయగల నేర్పుతో ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.