రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడు బెన్ స్టోక్స్ వికెట్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ తుషార్ పాండే. మరో వికెట్‌ను ఖాతాలో వేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మొదట బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభించాలనుకున్న తుషార్అనుకోకుండా పేసర్ అయ్యాడు.
జింఖానాలో ప్రాక్టీస్ :
ముంబయిలో చాలామందిలాగే జింఖానా శివాజీ పార్కు మైదానంలోనే తుషార్ ఆట మొదలైంది. ప్రస్తుత దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి అతడు సాధన చేసేవాడు. బ్యాటింగే ప్రధానంగా ఎదిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. అప్పుడప్పుడు కుడి చేతితో మీడియం పేస్ బౌలింగ్ చేశాడు. కానీ సెలక్షన్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం బౌలర్ లైన్లోకి వెళ్లి బంతి వేసే అవకాశం రావడం అతని అదృష్టాన్ని మలుపు తిప్పింది.
"2007లో సెలక్షన్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ వరుసలో ఎక్కువమంది ఉండటం వల్ల నా వరకు అవకాశం రాదని భావించా . అలా అని వదిలేసి వెళ్లలేను. అందుకే బౌలర్ల వరుసలో నిలబడ్డా. అప్పటివరకు మిగిలిన వాళ్లకంటే వేగంగా బంతులేస్తానని తెలియదు. నేను బౌలింగ్ చేసే సమయానికి చేతికి కొత్త బంతి వచ్చింది. ఆ బంతితో స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేశా. అలా రెండు మూడు రోజులు ట్రయల్స్‌లో పాల్గొన్నా. బౌలర్ల జాబితాలో చోటు సంపాదించా" అని తుషార్ గుర్తు చేసుకున్నాడు.
ఇప్పుడు ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తుషార్.. 2008 తొలి ఐపీఎల్లో బాల్ బాయ్‌గా పని చేయటం విశేషం.