చావోరేవో పోరులో ముంబయిని చిత్తుగా ఓడించి హైదరాబాద్ ఘనంగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనకు దిగిన హైదరాబాద్ 17.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85), వృద్ధిమాన్ సాహా (58) అజేయ అర్ధశతకాలతో అదరగొట్టారు.
బెంగళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్
ఈ విజయంతో 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరిన హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో శుక్రవారం తలపడనుంది. మరోవైపు టేబుల్ టాపర్‌గా నిలిచిన ముంబయి.. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో దిల్లీతో అమీతుమి తేల్చుకోనుంది. ఒక వేళ వార్నర్‌సేన ఓటమిపాలైతే కోల్‌కతాకు ప్లే ఆఫ్‌కు చేరుకునేది. నెట్‌రన్‌రేటు తక్కువగా ఉండటం వల్ల అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన రోహిత్ (4), డికాక్ (25)ను సందీప్ శర్మ ఆదిలోనే పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ (36)తో కలిసి ఇషాన్ కిషన్ (33) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే షాబాజ్ నదీమ్, రషీద్ ధాటికి ఏడు బంతుల్లోనే ముంబయి మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ బౌండరీలు బాదుతున్నప్పటికీ అతడికి సహచరుల నుంచి సహకారం లభించలేదు. హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆ జట్టును దెబ్బ తీశారు. కానీ, పొలార్డ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. నటరాజన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ మూడు, షాబాజ్, హోల్డర్ చెరో రెండు, రషీద్ ఒక వికెట్ తీశారు.