ఐపీఎల్ 13వ సీజన్ విజేతగా నిలిచిన ముంబయి జట్టుకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి ముంబయి జట్టు పేరుతో వెతికితే తారాజువ్వలు తెరపై వెలిగేలా ఏర్పాటు చేసింది. ముంబయి జట్టు వివరాలతో పాటు.. దిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ స్కోరు బోర్డు కూడా స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్‌సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఆరుసార్లు ఫైనల్ చేరి ఐదుసార్లు టైటిల్‌ను ఒడిసిపట్టింది. దీంతో టీ20లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి మరోసారి నిరూపించుకుంది.
దుబాయ్ వేదికగా జరిగిన టీ20 లీగ్ 13వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబయి బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడం వల్ల ఆ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో ముంబయి ఎక్కడా దిల్లీకి అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ 68(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ముంబయి విజయానికి బాటలు వేశాడు. రోహిత్‌కు తోడు ఇషాన్ కిషన్ 33(19), డికాక్ 20(12) కూడా రాణించారు. దీంతో 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌కు కెప్టెన్‌గా ఇది ఐదో ట్రోఫీ. 2013, 2015, 2017, 2019లో కప్పు గెలిచిన ఆ జట్టు మరోసారి 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. రెండు సార్లు 2011, 2013లో టీ20 ఛాంపియన్స్ లీగ్‌లోనూ ట్రోఫీని ముద్దాడింది.
ఇదీ చూడండి:ఐపీఎల్2020.. కల్లోల కాలంలో ఆశల వారధి