53 రోజులు..60 మ్యాచ్‌లు..4 సూపర్ ఓవర్లు.. 734 సిక్సర్లు.. 668 వికెట్లు... ఆఖరి లీగ్ మ్యాచ్ వరకు తేలని ఫ్లేఆఫ్ బెర్తులు... వెరసి అన్ని సీజన్లలో ఆల్‌టైమ్ హిట్‌గా పదమూడో సీజన్ వినోదాన్ని పంచింది. కరోనా కష్ట కాలంలో ఎన్నో అడ్డంకులను దాటుకుని యూఏఈలో నిర్వహించిన లీగ్ అభిమానులకు మరవలేని జ్ఞాపకంగా నిలిచింది. ఎన్నోనెలల తర్వాత ధోనీ మైదానంలోకి దిగడం.. డబుల్ సూపర్‌ఓవర్.. పుష్కరకాలం అనంతరం దిల్లీ ఫైనల్‌కు చేరడం.. రోహిత్ శర్మ మరోసారి ట్రోఫీని అందుకోవడం.. వర్ధమాన ఆటగాళ్లు సత్తాచాటడం.. ఇలా మధురమైన క్షణాలకు ఈ లీగ్ వేదికగా మారింది. ఇలా ఈ సీజన్‌లో అందరూ మెచ్చిన క్షణాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
వారెవ్వా... పూరన్
ప్రతి సీజన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లకు కొదవ ఉండదు. ఈ సారీ కూడా అద్భుత విన్యాసాలతో ఆటగాళ్లు ఫీల్డింగ్ విన్యాసాలు చేశారు. ముంబయి జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన అనుకుల్ రాయ్ వెనక్కి పరిగెడుతూ అందుకున్న క్యాచ్.. వికెట్ల వెనుక ఉన్న ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్ గాల్లోకి అమాంతం ఎగిరి బంతిని ఒడిసి పట్డడం... ఈ సీజన్‌లో హైలైట్. అయితే రాజస్థాన్ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ సిక్సర్‌ను ఆపిన విధానం అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచి బౌండరీని దాటింది. కానీ, బౌండరీ లైన్‌లో ఉన్న పూరన్.. ఆ బంతి నేలను చేరేలోపే బౌండరీ అవతలికి అద్భుతంగా డైవ్ చేస్తూ అందుకుని తిరిగి మైదానంలోకి విసిరాడు. ఇదంతా గాల్లో ఉన్నప్పుడే రెప్పపాటులో జరిగింది. అంతేగాక, డబుల్ సూపర్ ఓవర్‌లో సిక్సర్‌ను అడ్డుకున్న మయాంక్ అగర్వాల్ విన్యాసం కూడా మెరుపు ఫీల్డింగ్ జాబితాలో టాప్‌లో నిలిచింది. గాల్లోకి ఎగిరి బంతిని రెండుచేతులతో ఒడిసిపట్టి తిరిగి మైదానంలో విసిరి.. బౌండరీ అవతల అతడు దూకాడు.
సిక్సర్ల పిడుగు తెవాతియా..
ఈ సీజన్‌లో డివిలియర్స్, పొలార్డ్, బెన్‌స్టోక్స్, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. అయితే అంచనాలు లేకుండా విధ్వంసం సృష్టించిన రాహుల్ తెవాతియా ఇన్నింగ్స్ ప్రత్యేకం. ఎదురుగా కొండంత లక్ష్యం ఉండటంతో ఒత్తిడితో తెవాతియా బంతికి బ్యాట్‌ను కూడా తాకించలేక అవస్థలు పడ్డాడు. 19 బంతుల్లో 8 పరుగులే చేసి అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. ఇక రాజస్థాన్ ఓటమి ఖరారైందని భావిస్తున్న తరుణంతో చెలరేగాడు. తర్వాతి 12 బంతుల్లో ఏకంగా 45 పరుగులు బాదేశాడు. పంజాబ్ బౌలర్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా అయిదు సిక్సర్లతో విజృంభించాడు. దీంతో 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించడం విశేషం. ఆల్‌రౌండర్ తెవాతియా విధ్వంసాన్ని అభిమానులు అంత సులువుగా మరవలేరు. ఈ సీజన్‌లో అతడు బ్యాటుతో పాటు బంతితోనూ అలరించాడు. 42 సగటుతో పరుగులు చేయడమేగాక 10 వికెట్లు పడగొట్టాడు.
ఔటైనా ఇషాన్, గేల్.. సాధించారు.
ఎప్పటిలా ఈ సీజన్‌లోనూ బ్యాట్స్‌మెన్ సెంచరీలతో అలరించారు. శిఖర్ ధావన్ రెండు శతకాలు సాధించగా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, బెన్ స్టోక్స్ తలో ఒక్క సెంచరీ నమోదు చేశారు. అయితే ఇషాన్ కిషన్, క్రిస్ గేల్ మూడంకెల స్కోరు అందుకోలేకపోయినా.. వారి ఇన్నింగ్స్‌లు ఆకట్టుకున్నాయి. ఒత్తిడిలో బెంగళూరుపై యువహిట్టర్ ఇషాన్ చేసిన 99 పరుగులు, రాజస్థాన్‌పై యూనివర్సల్ బాస్ చేసిన 99 స్కోరు ఈ సీజన్‌లో స్పెషల్ ఇన్నింగ్స్‌లు. శతకాన్ని కోల్పోయిన క్షణంలో వాళ్ల భావోద్వేగాలు అందరి మనసుల్ని కదిలించాయి.
పాత రికార్డులు పటాపంచలు
రికార్డుల పరంగానూ ఈ సీజన్ ప్రత్యేకమైనదే. లీగ్‌లో అత్యధిక ఛేదన, భారత ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డులు బద్దలయ్యాయి. పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రాజస్థాన్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఘనత రాజస్థాన్ పేరిటే ఉండేది. 2008లో హైదరాబాద్‌పై 215 పరుగులను ఛేదించింది. కాగా, ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల నమోదు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.
అంపై'రాంగ్'
ఈ సీజన్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు ఆటగాళ్లతో పాటు విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. దిల్లీ×పంజాబ్ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ తీసిన పరుగును షార్ట్‌రన్‌గా పరిగణించడం, రాజస్థాన్×చెన్నై పోరులో టామ్ కరన్ నాటౌట్ అయితే ఔట్‌గా ప్రకటించడం చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక పలు మ్యాచ్‌ల్లో నోబాల్స్‌ను ఫుల్ టాస్‌గా తేల్చారు. ఇక హైదరాబాద్ మ్యాచ్‌లో ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడని అంపైర్ తన వైడ్ నిర్ణయాన్ని మార్చుకోవడం వివాదంగా మారింది. థర్డ్ అంపైర్లు సైతం తీసుకున్న కొన్ని నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఔట్ ఈ కోవకు చెందిందే.
ఫ్రీహిట్‌లో రనౌట్..
క్రికెట్ ప్రేక్షకులు బెంగళూరు జట్టును దురదృష్టానికి చిరునామాగా భావిస్తుంటారు. ఎంతో బలమైన జట్టు అయినా ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కే పరిమితమైంది. అయితే హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొయిన్ అలీ ఔటైన విధానం ఎవరూ కోరుకోనిది. ఫ్రీహిట్ బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి అలీ రనౌటయ్యాడు. క్రికెట్ వ్యాఖ్యాతలు సైతం ఇలాంటి సంఘటనలు బెంగళూరు జట్టుకు మాత్రమే జరుగుతాయనడం గమనార్హం.
తప్పకుండా తిరిగొస్తా..
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ అనంతరం 438 రోజుల తర్వాత ఎంఎస్ ధోనీ పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ముంబయితో జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ‘తలా’ టీవీలో కనపడటంతో అభిమానులు ఎంతో ఆనందించారు. కానీ ఈ సీజన్‌లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించలేకపోయాడు. ఉక్కపోత వాతావరణంలో వికెట్ల మధ్య పరిగెత్తుతూ అలసటతో హైదరాబాద్ మ్యాచ్‌లో మోకాలుపై కూర్చుండిపోయాడు. ఆ స్థితిలో ధోనీని చూసి బహుశా బాధపడని వారుండరేమో. వికెట్ల మధ్య చిరుతులా పరిగెత్తూ, భారీ సిక్సర్లు సాధిస్తూ ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన ధోనీని ఆ పరిస్థితుల్లో చూడలేపోయారు. అయితేనేం తర్వాత మ్యాచ్‌ల్లో ధోనీ వికెట్‌కీపింగ్‌లో సత్తాచాటాడు. కష్టతరమైన క్యాచ్‌లను అందుకున్నాడు. కాగా, ధోనీ తన జెర్సీలను ఆటగాళ్లకు గిఫ్ట్‌లుగా అందివ్వడంతో ‘తలా’కి ఇదే ఆఖరి సీజన్ ఏమోనని అభిమానులు అనుమానించారు. పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ధోనీని వ్యాఖ్యాత ఇదే ప్రశ్నించగా.. ‘కచ్చితంగా కాదు’ అని బదులిచ్చాడు. ఈ సమాధానాన్ని అందరూ మెచ్చారు.
డబుల్ ధమాకా
నాలుగు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు. అందులో ఓ డబుల్ సూపర్ ఓవర్. ఈ సీజన్ అభిమానులను ఎంత ఉత్కంఠకు దారితీసిందో చెప్పడానికి ఇవి సరిపోవా. బుమ్రా, షమి నువ్వా-నేనా అని పోటీపడుతూ బంతులు సంధించడంతో ముంబయి×పంజాబ్ మ్యాచ్.. సూపర్ ఓవర్ నుంచి రెండో సూపర్ ఓవర్‌కు దారితీసింది. చివరికి పంజాబ్ పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. అయితే కేఎల్ రాహుల్ చేసిన అద్భుతమైన రనౌట్, మయాంక్ అగర్వాల్ మెరుపు ఫీల్డింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి ఐపీఎల్2020.. కల్లోల కాలంలో ఆశల వారధి