సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 లక్ష్యాన్ని ఛేదించలేక 185 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో వేగంగా 3000 పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది బెంగళూరు. ఓపెనర్లు పార్థివ్ పటేల్ రాణించగా, కోహ్లి కేవలం 13 పరుగులే చేసి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు నిలిచి 44 బంతుల్లో 82 పరుగులు చేశాడు.
కొంత సేపటి తర్వాత 43 పరుగులు చేసిన పార్థివ్ మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో స్టాయినిస్ తప్ప మిగతా ఎవరూ డివిలియర్స్‌కు సహకరించలేకపోయారు. మొయిన్ అలీ 4, అక్షదీప్ నాథ్ 3 పరుగులే చేసి ఔటయ్యారు. చివరి వరకు నిలిచిన స్టాయినిస్ 46 పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో షమి, అశ్విన్, మురుగన్ అశ్విన్, విజెలిన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పంజాబ్. ఓపెనర్లు రాహుల్, గేల్ వేగంగా ఆడారు. 3.2 ఓవర్లలోనే 42 పరుగులు చేశారు. ఆ వెంటనే 23 పరుగులు చేసిన గేల్.. ఉమేశ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తర్వాత మాయాంక్తో కలిసిన రాహుల్... స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9.1 ఓవర్ వద్ద 35 పరుగులు చేసిన మయాంక్.. స్టాయినిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే 42 రన్స్ చేసిన రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన మిల్లర్, నికోలస్ పూరన్.. నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో పంజాబ్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ 19 ఓవర్ వేసిన సైనీ.. మిల్లర్, పూరన్‌లను ఔట్ చేశాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన ఉమేశ్.. అశ్విన్, విజెలిన్ను ఔట్ చేసి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు.
ఆర్సీబీ బౌలర్లలో ఉమేశ్ మూడు వికెట్లు తీశాడు. సైనీ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టాయినిస్, అలీ తలో వికెట్ తీశారు.