Ind vs Ireland: వర్షం ప్రభావం చూపిన తొలి టీ20లో ఐర్లాండ్‌పై సులువుగానే నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థికి 226 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా చచ్చీ చెడీ 4 పరుగుల తేడాతో గెలిచింది. తొలి టీ20లో 47 పరుగులతో అజేయంగా నిలిచిన దీపక్ హుడా.. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదేయడం, జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన సంజు శాంసన్ సైతం రెచ్చిపోవడంతో భారత్ 7 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదన దాదాపు అసాధ్యం అనిపించిన లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. విజయం కోసం గొప్పగా పోరాడింది. ఓపెనర్లు బాల్‌బిర్నీ (60; 37 బంతుల్లో 3×4, 7×6), స్టిర్లింగ్ (40; 18 బంతుల్లో 5×4, 3×6) జట్టుకు మెరుపు ఆరంభాన్నిస్తే.. తర్వాత డాక్రెల్ (34 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 3×6), టెక్టార్ (39; 28 బంతుల్లో 5×4) ఐర్లాండ్‌ను గెలిపించడానికి విఫలయత్నం చేశారు. ఆ జట్టు 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. స్టిర్లింగ్ విధ్వంసంతో ఐర్లాండ్ 5 ఓవర్లకే ఐర్లాండ్ స్కోరు 65 పరుగులకు చేరుకోవడం విశేషం. కానీ స్టిర్లింగ్ ఔటయ్యాక స్కోరు వేగం తగ్గింది. ఆ తర్వాత బాల్‌బిర్నీ పోరాటం కొనసాగించినా.. అతను 11వ ఓవర్లో ఔటైపోవడంతో ఐర్లాండ్ విజయానికి రేసులో లేనట్లే కనిపించింది. కానీ టెక్టార్ అండతో డాక్రెల్ చెలరేగిపోవడం, చివర్లో అడైర్ (23 నాటౌట్; 12 బంతుల్లో 3×4, 1×6) కూడా పోరాడడంతో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువైంది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. ఉమ్రాన్ తొలి బంతికి పరుగివ్వలేదు. కానీ రెండో బంతికి నోబాల్ వేశాడు. అడైర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 3 బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఈ స్థితిలో ఉమ్రాన్ షాట్లకు అవకాశం ఇవ్వకుండా గొప్పగా బౌలింగ్ చేశాడు. 3 బంతుల్లో 3 పరుగులే రావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
బాదుడే బాదుడు: అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. ఐర్లాండ్ బౌలింగ్‌తో ఆటాడుకుంది. ఆరంభంలోనే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేయడం, చివర్లో చకచకా కొన్ని వికెట్లు తీయడం తప్పితే ఆ జట్టు సంతోషించడానికి ఏమీ లేకపోయింది. పిక్క గాయంతో ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్న రుతురాజ్ స్థానంలో ఓపెనింగ్ చేసిన శాంసన్.. లేక లేక భారత జట్టు తరఫున వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగా, తొలి టీ20 ఊపును కొనసాగిస్తూ దీపక్ హుడా మరింతగా చెలరేగిపోయాడు. ఇషాన్ (3)ను మూడో ఓవర్లో వికెట్ కీపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చిన అడైర్ తన జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చినా.. ఆ సంతోషాన్ని ఎంతోసేపు నిలవనీయకుండా వచ్చీ రాగానే అదే ఓవర్లో భారీ సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు హుడా. అక్కడి నుంచి అతను, శాంసన్ పోటీ పడి షాట్లు ఆడారు.
పవర్‌ప్లే ముగిసేసరికి 54/1తో నిలిచిన భారత్.. 10.1 ఓవర్లలోనే 100 దాటేసింది. 14 పరుగులపై ఉండగా లిటిల్ బౌలింగ్‌లో అంపైర్ హుడాను ఎల్బీగా ప్రకటించగా.. అతను సమీక్ష కోరి బతికిపోయాడు. ఆ తర్వాత 33 పరుగుల వద్ద అతనిచ్చిన కష్టమైన క్యాచ్‌ను స్టిర్లింగ్ వదిలేశాడు. ఈ అవకాశాల్ని ఉపయోగించుకున్న హుడా.. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించి సెంచరీ పూర్తి చేశాడు. పదో ఓవర్లో అర్ధసెంచరీ (27 బంతుల్లో) సాధించిన అతను.. 14వ ఓవర్లోనే 90లోకి వచ్చేయడం విశేషం. మరోవైపు శాంసన్ కూడా జోరుమీదుండటంతో.. 18వ ఓవర్ తొలి బంతికి కానీ అతడి సెంచరీ పూర్తి కాలేదు. శాంసన్ 31 బంతుల్లో 50ని అందుకున్నాడు. 16 ఓవర్లకు 183/1తో నిలిచిన భారత్.. 250కి చేరువయ్యేలా కనిపించింది. కానీ చివరి 4 ఓవర్లలో ఆరు వికెట్లు పడ్డాయి. హుడా సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే లిటిల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (15), హార్దిక్ (13 నాటౌట్) కొన్ని షాట్లు ఆడడంతో స్కోరు 225కి చేరుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ (3/42), లిటిల్ (2/38), యంగ్ (2/35) రాణించారు.
భారత్ ఇన్నింగ్స్: శాంసన్ (బి) అడైర్ 77; ఇషాన్ (సి) టకర్ (బి) అడైర్ 3; దీపక్ హుడా (సి) మెక్‌బ్రైన్ (బి) లిటిల్ 104; సూర్యకుమార్ (సి) టకర్ (బి) లిటిల్ 15; హార్దిక్ నాటౌట్ 13; కార్తీక్ (సి) టకర్ (బి) యంగ్ 0; అక్షర్ (సి) డాక్రెల్ (బి) యంగ్ 0; హర్షల్ (బి) అడైర్ 0; భువనేశ్వర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 225; వికెట్ల పతనం: 1-13, 2-189, 3-206, 4-212, 5-217, 6-217, 7-224; బౌలింగ్: అడైర్ 4-0-42-3; లిటిల్ 4-0-38-2; యంగ్ 4-0-35-2; డెలానీ 4-0-43-0; ఓల్ఫర్ట్ 3-0-47-0; మెక్‌బ్రైన్ 1-0-16-0
ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (బి) బిష్ణోయ్ 40; బాల్‌బిర్నీ (సి) బిష్ణోయ్ (బి)హర్షల్ 60; డెలానీ రనౌట్ 0; టెక్టార్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 39; టకర్ (సి) చాహల్ (బి) ఉమ్రాన్ 5; డాక్రెల్ నాటౌట్ 34; అడైర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221; వికెట్ల పతనం: 1-72, 2-73, 3-117, 4-142, 5-189; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-46-1; హార్దిక్ పాండ్య 2-0-18-0; హర్షల్ పటేల్ 4-0-54-1; రవి బిష్ణోయ్ 4-0-41-1; ఉమ్రాన్ 4-0-42-1; అక్షర్ 2-0-12-0
- అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ దీపక్ హుడా. మొత్తంగా భారత్ తరఫున ఇది 8వ టీ20 శతకం. రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు చేస్తే, కేఎల్ రాహుల్ రెండుసార్లు వంద కొట్టాడు. రైనా ఓ శతకం సాధించాడు.
- 77: సంజు శాంసన్ పరుగులు. టీ20ల్లో ఇదే అతడికి అత్యధిక స్కోరు. గత అత్యుత్తమం 39 పరుగులే.
- 176: శాంసన్, హుడా జోడించిన పరుగులు. భారత్ తరఫున టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
- 225/7: టీ20ల్లో భారత్‌కిది నాలుగో అత్యుత్తమ స్కోరు.
ఇవీ చదవండి: