మరోసారి ప్రతిష్ఠాత్మక సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. ఈసారి గతంలా కాదు.. స్మిత్, వార్నర్ చేరికతో బలపడ్డ ఆసీస్‌ను కొట్టాలంటే ఇంకా గట్టిగా పేలాల్సిందే. మరి ఈసారి తారాజువ్వల్లా దూసుకెళ్లేదెవరో? ప్రత్యర్థి పాలిట బాంబులా మారేదెవరో? హండ్రెడ్ వాలాలా ఎక్కువసేపు పేలేదెవరో? కాకర పువ్వొత్తుల్లా కాంతులు నింపేదెవరో?
కోహ్లి.. మెరుపులు కొంతే..!
బ్యాట్‌తో రాణించి.. నాయకత్వంతో మెప్పించి.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు తొలి టెస్టు సిరీస్ అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లి వెలుగులు ఈసారి కొన్ని రోజులే. ఆ సిరీస్‌లో ఓ సెంచరీ సహా 282 పరుగులతో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన అతను.. రాబోయే సిరీస్‌లో కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. తన భార్య బిడ్డకు జన్వనివ్వనున్న నేపథ్యంలో అతను తొలి టెస్టు తర్వాత తిరిగి స్వదేశానికి రానున్నాడు. అతను తిరిగి జట్టుతో చేరే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
రోహిత్ గాయం ఏం చేస్తుందో..
ఇక తారాజువ్వలా దూసుకుపోయే రోహిత్ శర్మ 2018-19 సిరీస్‌లో (2 మ్యాచ్‌ల్లో 106) పెద్దగా రాణించలేదు. నిరుడు దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా అవతారమెత్తిన అతను నిలకడగా చెలరేగుతున్నాడు. అయితే ఐపీఎల్-13లో తన జట్టును విజేతగా నిలిపిన అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఆందోళన కలిగించే విషయం. అందుకే అతణ్ని కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు.
అదరగొడుతున్న బుమ్రా..
ఇక బౌలింగ్‌లో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బాంబుల్లాంటి బంతులతో బెంబేలెత్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో కిందటి సిరీస్‌లో 21 వికెట్లతో సత్తాచాటి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా కాస్త లయ తప్పినట్లు అనిపించిన అతను.. ఐపీఎల్-13తో తిరిగి మునుపటి జోరు అందుకున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో ముంబయి ఇండియన్స్ అయిదోసారి ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
చిచ్చుబుడ్డుల్లా రాహుల్, మయాంక్
మరోవైపు ఈ సారి చిచ్చుబుడ్లలా విరజిమ్మేందుకు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సిద్ధమయ్యారు. గత సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన రాహుల్ (3 మ్యాచ్‌ల్లో 57).. ఆ తర్వాత నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ (670 పరుగులు) చెలరేగడంతో అతనికి టెస్టు జట్టులో చాలా కాలం తర్వాత చోటు దక్కింది. ఇక గత సిరీస్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న మయాంక్ (2 మ్యాచ్‌ల్లో 195) అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో (11 మ్యాచ్‌ల్లో 424) గొప్పగా రాణించి టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్లలోనూ అతను స్థానం దక్కించుకున్నాడు.
రిషబ్‌పంత్ కొనసాగిస్తాడా..?
యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. 4 మ్యాచ్‌ల్లో 58.33 సగటుతో 350 పరుగులు చేసిన అతను.. ఓ శతకం కూడా నమోదు చేశాడు. కానీ ఈ సారి అదే ప్రదర్శన పునరావృతం చేస్తాడా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిలకడగా పడిపోతున్న అతని ఆటతీరే అందుకు కారణం. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్లకు దూరమైన అతను.. ఈ టెస్టుల్లోనూ రాణించకపోతే అంతే సంగతి.
పుజారా గత సిరీస్ జోరు కనిపిస్తుందా..?
ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా చారిత్రక విజయంలో చతేశ్వర్ పుజారా ప్రధాన పాత్ర పోషించాడు. 4 మ్యాచ్‌ల్లో 74.42 సగటుతో 521 పరుగులతో ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు (రెండు జట్లలోనూ) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు శతకాలు చేసిన అతను.. హండ్రెడ్ వాలాలా పేలాడు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల ఆటలకు విరామం లభించడంతో పుజారాకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఐపీఎల్‌లో అతణ్ని ఏ జట్టూ తీసుకోలేదు. మరోవైపు తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్నాననే భయం, బెరుకు లేకుండా గత సిరీస్‌లో సీమ టపాకాయలా పేలాడు..
ఇదీ చూడండి:ఆ విషయం రోహిత్‌నే అడగండి: గంగూలీ