Ind vs Nz Semi Final 2023 : 2023 వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌పై భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (117 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలు నమోదు చేశారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. శతక భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడీని సౌథీ విడదీశాడు. రోహిత్ (47; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు అదే జోరుతో అర్ధశతకం పూర్తి చేసుకుని సెంచరీ వైపు అడుగులు వేస్తున్న శుభ్‌మన్ గిల్ (65 బంతుల్లో 79 పరుగులు 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విరాట్ కోహ్లీ చూడచక్కని షాట్లతో ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఫెర్గూసన్ వేసిన 41.4 బంతికి రెండు పరుగులు చేసిన కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్‌గా సరికొత్త చరిత్రను సృష్టించాడు. అంతేకాదు, ఇప్పటివరకూ సచిన్ పేరిట ఉన్న (49) సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన కోహ్లీ.. సౌథీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 163 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు శ్రేయస్ తన దూకుడు పెంచి శతకాన్ని అందుకున్నాడు. జోరుమీదున్న శ్రేయస్.. బౌల్ట్ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యకుమార్ 1(2), తక్కువ పరుగులకే ఔట్ కాగా, రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్ గిల్ (80; 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) తిరిగి వచ్చి కేఎల్ రాహుల్ 39 (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి ఇన్నింగ్స్ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టినా 100 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కింది.