ICC World Cup 2023 : వరల్డ్ కప్‌లో పాల్గొనే చిన్న జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. ఈ జట్టులో అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించగల అనేక మంది ఆటగాళ్లున్నారు. అయితే ఈ టీమ్‌లో అందరి చూపు తమ వైపునకు తిప్పికునే ప్లేయర్లు కొందరు ఉన్నారు. అందులో ప్రధానంగా ప్రభావం చూపించగలిగే అవకాశం ఉన్న అయిదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. మాక్స్ ఓ డౌడ్
నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్‌లో మాక్స్ ఓ డౌడ్ టాప్ ఆర్డర్ ఆటగాడు. అతడు ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 37.35 సగటుతో 1,158 పరుగులు చేశాడు. 73.99 స్ట్రైక్ రేట్‌తో 10 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోరు 90 పరుగులు చేశాడు.
2. స్కాట్ ఎడ్వర్డ్స్
నెదర్లాండ్స్ టీమ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్.. ఓ వైపు కెప్టెన్సీతో పాటు మరోవైపు బ్యాట్‌తోనూ రాణిస్తాడు. ఎడ్వర్డ్స్ ఇప్పటిదాకా 38 వన్డేలు ఆడాడు. 40.40 సగటుతో మొత్తం 1212 పరుగులు చేశాడు. 92.73 స్ట్రైక్ రేట్‌తో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్కాట్ వ్యక్తగత అత్యధిక స్కోరు 86 పరుగులు.
3. తేజ నిడమనూరు
తెలుగు మూలాలున్న అనిత్ తేజ నిడమనూరు నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్లేయర్ ఇంతకుముందు న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో ఆక్లాండ్ తరఫున ఆడాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఈ జట్టు విజయంలో తేజ కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 76 బంతుల్లో 111 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. తేజ ఇప్పటి వరకు 20 వన్డేలు ఆడి 29.5 సగటు, 95.1 స్ట్రైక్ రేట్‌తో 511 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
4. బేస్ డీ లైడ్
నెదర్లాండ్స్ జట్టులో ఉన్న ఆల్ రౌండర్లలో బేస్ డీ లైడ్ ఒకడు. తన ప్రదర్శనతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సామర్థ్యం ఇతడి సొంతం. లైడ్ ఇప్పటి వరకు 30 వన్డేలు ఆడి 765 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఇతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 123. సగటు 27.32, స్ట్రైక్ రేట్ 66.57గా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా 24 వికెట్లు పడగొట్టాడు లైడ్. ఎకానమీ 5.94 ఉండగా.. బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 52-5.
5. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే
రోలోఫ్ వాన్ డెర్ మెర్వే నెదర్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. ఇండియన్ పిచ్‌లపై ఇతడికి బాగా అవగాహన ఉంది. దీంతో ఈ టోర్నీలో రోలోఫ్ ప్రమాదకరంగా మారే అవకాశముంది. తన బౌలింగ్‌తో బంతిని తిప్పుతూ బ్యాటర్‌ని కష్టాల్లోకి నెట్టే అవకాశముంది. మెర్వే ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడగా.. 19 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.98 , బౌలింగ్ యావరేజ్ 36.5గా ఉంది. మరోవైపు బ్యాటింగ్ లోనూ 96 పరుగులు చేయగా.. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.
ICC world cup 2023 : భారత్ వరల్డ్‌కప్ గెలవాలంటే ఈ అడ్డంకులు దాటాల్సిందే.. అది సాధ్యమేనా?