ICC Player of the Month Virat Kohli: అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లు ప్రకటించింది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ తొలిసారి ఈ అవార్డులకు నామినేట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సింకిందర్ రజా అతడికి పోటీగా ఉన్నారు. మహిళల విభాగంలో భారత్ నుంచి జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఎంపికయ్యారు.
ఛేదన రారాజు విరాట్ కోహ్లీ మునుపెన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్లో తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. వరుసగా హాఫ్ సెంచరీలు సాధిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమ్‌ఇండియా 31/4తో కష్టాల్లో పడ్డ సమయంలో అతడు 160 లక్ష్యాన్ని ఛేదించడం అద్భుతం. అంతకు ముందు గువాహటిలో దక్షిణాఫ్రికాపై 28 బంతుల్లోనే 49 నాటౌట్‌గా నిలిచాడు. ఇక నెదర్లాండ్స్‌పై 44 బంతుల్లో 62 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. మొత్తంగా అక్టోబర్లో 150 స్ట్రైక్‌రేట్, 205 సగటుతో 205 టీ20 రన్స్ సాధించడం గమనార్హం.
ఈ ఏడాది ఆరంభం నుంచి డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించాడు. అక్టోబర్లో అతడి ఫామ్ శిఖర స్థాయికి చేరుకుంది. టీమ్‌ఇండియాపై గువాహటిలో 47 బంతుల్లో 106తో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో పెర్త్‌లో టీమ్‌ఇండియాపై గెలుపు ఇన్నింగ్స్ ఆడాడు. అత్యంత కష్టమైన పిచ్‌పై 59 పరుగులతో అజేయంగా నిలిచి విజయం అందించాడు. వన్డేల్లో లక్నోలో భారత్‌పై 75*తో అలరించాడు. మొత్తంగా అక్టోబర్లో అతడు 303 పరుగులు చేశాడు.
జింబాబ్వే వెటరన్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఈ మధ్యన మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. అక్టోబర్లో మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో తన జట్టుకోసం పట్టుదలగా ఆడుతున్నాడు. ఐర్లాండ్‌పై 47 బంతుల్లోనే 82 కొట్టాడు. అలాగే ఒక వికెట్ పడగొట్టాడు. స్కాంట్లాండ్ పైనా 23 బంతుల్లో 40 రన్స్ చేసి 1 వికెట్ తీశాడు. వెస్టిండీస్, పాకిస్థాన్‌పై బంతితో 3/19, 3/25తో ఆకట్టుకున్నాడు. ఓ అద్భుతమైన త్రో విసిరి పాకిస్థాన్‌పై విజయం అందించాడు.